
కొల్లగొడుతున్నారు..
దుందుభీని లూటీ చేస్తున్న ఇసుకాసురులు
●
అదనంగా డబ్బులిస్తేనే..
నేను కొత్తగా ఇంటి నిర్మాణం మొదలుపెట్టా. ఆన్‌లైన్‌లో పది ట్రిప్పుల ఇసుక కోసం డబ్బులు చెల్లించాను. అదనంగా రూ.500 ఇస్తేనే ఇసుకను తెస్తాం.. లేకపోతే బుకింగ్ క్యాన్సల్ చేస్తామని చెప్పారు. ఇప్పటికీ 5 ట్రిప్పులు మాత్రమే ఇసుక తెచ్చారు. ప్రతి ట్రాక్టర్‌కు అదనంగా రూ.300 వరకు ఇవ్వక తప్పలేదు. మట్టితో కూడిన ఇసుక తెచ్చిపోసినా అడిగే అవకాశం లేదు. ఇంతకు ముందు ఇదే రేటుకు ట్రాక్టర్ వారితో మాట్లాడుకొని మనకు నచ్చిన ఇసుక తెచ్చుకునేవాళ్లం.
– ఆలూరి వెంకటేష్, ఉప్పనుంతల
ఉన్నతాధికారుల ఆదేశాలపైనే..
కలెక్టర్ మౌఖిక ఆదేశాల మేరకే బల్మూరు, అమ్రాబాద్ తదితర మండలాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం దుందుభీ వాగు నుంచి ఇసుక సేకరణకు అనుమతి పత్రాలు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నేరుగా వారు ఎంచుకున్న ట్రాక్టర్ నంబర్‌తోనే ఇసుక తరలింపునకు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. కార్యాలయంలో ఇతర పనుల వల్ల ఇసుక తరలింపుపై దృష్టిపెట్టలేకపోతున్నాం.
– ప్రమీల, తహసీల్దార్,
ఉప్పునుంతల
ఉప్పునుంతల: ఒకపక్క మన ఇసుక వాహనం ఆన్‌లైన్ బుకింగ్ పేరిట వాగు నుంచి ఇసుక సేకరిస్తుండటం.. మరోపక్క ఆఫ్‌లైన్‌లో ఇందిరమ్మ ఇళ్ల పేరిట రెవెన్యూ అధికారులు విచ్చలవిడిగా అనుమతి పత్రాలు ఇస్తున్నారు.. ఇదే అదునుగా ఇసుక అక్రమదారులు మండల సరిహద్దులోని దుందుభీ వాగును లూటీ చేస్తున్నారు. మన ఇసుక వాహనం ద్వారా ప్రభుత్వానికి కొంత ఆదాయం చేకూరడంతోపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండ ఇసుక లభిస్తుందని ఆశించిన వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇసుక కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వినియోగదారులు సకాలంలో ఇసుక అందక ఎదురుచూడాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా కొందరు ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు ఫోన్ చేసి తమకు అదనంగా డబ్బులు ఇస్తేనే ఇసుక తెస్తామని వినియోదారులను వేధిస్తున్నారు. రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు డిమాండ్ చేస్తూ.. చివరికి రూ.300 వరకు వసూలు చేస్తున్నారు. ఒకవేళ వినియోగదారులు స్పందించకుంటే వారి బుకింగ్ క్యాన్సిల్ చేసేందుకు వెనుకాడటం లేదు. కొందరు ట్రాక్టర్ల యజమానులతో మైనింగ్‌కు సంబంధించిన ట్యాక్స్ ఆఫీసర్, రీచ్ ఆఫీసర్ కుమ్మకై ్క బుకింగ్‌లను క్యాన్సల్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
క్వారీ నుంచి వచ్చాక..
మన ఇసుక వాహనం ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్, ఆఫ్‌లైన్‌లో తహసీల్దార్ ఇస్తున్న అనుమతుల మేరకు ప్రస్తుతం పెద్దాపూర్ సమీపంలోని దుందుభీ వాగులో మూడు క్వారీల ద్వారా ఇసుక సేకరిస్తున్నారు. ఒక రోజు 200ల ట్రాక్టర్ల ట్రిప్పుల వరకు అనుమతులు ఉండగా.. మరో 50 ట్రిప్పుల వరకు అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక ట్రాక్టర్లకు నింపుకొని క్వారీ నుంచి రోడ్డు వద్దకు చేరిన తర్వాత అనుమతి పత్రాలు పరిశీలిస్తుండటం అక్రమానికి అవకాశం కల్పిస్తోంది. రెవెన్యూ పరంగా వీఆర్‌ఏ, మైనింగ్ నుంచి రీచ్ ఆఫీసర్, పోలీస్ సిబ్బంది ఒకరిని అక్కడ ఉంచుతున్నారు. క్వారీ నుంచి ఇసుక నింపుకొని అక్కడికి వచ్చిన ట్రాక్టర్ల యజమానులు అనుమతి పత్రాలు లేకపోతే అక్కడున్న వారిని ఏదో ఒకరకంగా మేనేజ్ చేసి ట్రాక్టర్‌ను పంపిస్తున్నారు. ముందుగానే అనుమతి పత్రాలు పరిశీలించి ట్రాక్టర్లను క్వారీలోకి అనుమతిస్తే కొంతమేర అక్రమ రవాణాను కట్టడి చేసే అవకాశం ఉంటుంది.
‘మన ఇసుక వాహనం’
విధానంలోనూ ఆగని అక్రమాలు
వినియోగదారుల నుంచి
అదనంగా డబ్బులు డిమాండ్
ఇందిరమ్మ ఇళ్ల పేరిట
విచ్చలవిడిగా అనుమతులు
అధికారుల పర్యవేక్షణ లోపంతో
తరలింపులో పక్కదారి
ఈ విషయమై జిల్లా మైనింగ్ అధికారి వెంకటరమణకు ‘సాక్షి’ ఫోన్ చేసినా స్పందించ లేదు. అందుబాటులో ఉన్న రీచ్ ఆఫీసర్ రమేష్‌ను వివరణ కోరగా తనకు బుకింగ్ క్యాన్సల్‌కు
ఎలాంటి సంబంధం లేదని, కేవలం ఆన్‌లైన్‌లో బుకింగ్‌పై వెళ్తున్న ఇసుక ట్రాక్టర్‌ను మాత్రమే తనిఖీ చేసి
పంపిస్తున్నానని చెప్పుకొచ్చారు.
లబ్ధిదారుల పేర్లు లేకుండానే..
కలెక్టర్ మౌఖిక ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్లు, ఇతర అభివృద్ధి పనుల పేరిట స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుంచి ఇసుక అనుమతులు విచ్చలవిడిగా ఇస్తున్నారు. శనివారం ఒక్క రోజే రెవెన్యూ అధికారులు 72 ట్రిప్పులకు అనుమతిచ్చారు. కనీసం అనుమతి పత్రాలపై ఇళ్ల లబ్ధిదారుల పేర్లు కూడా రాయడం లేదు. కొంతమంది ట్రాక్టర్ల యజమానులు అధికారులకు డబ్బులు ముట్టజెప్పి అనుమతి పత్రాలు అక్రమంగా పొందుతున్నట్లు తెలుస్తోంది. రెండు ట్రిప్పులకు తీసుకుంటున్న అనుమతి పత్రాలపై నాలుగు ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నారు. ఇలా చేస్తేనే అన్ని ఖర్చులు పోను తమకు ఎంతో కొంత మిగులుతుందని ట్రాక్టర్ల యజమానులు బాహాటంగానే చెబుతున్నారు.

కొల్లగొడుతున్నారు..

కొల్లగొడుతున్నారు..

కొల్లగొడుతున్నారు..