
భూ సమస్యల ప్రక్షాళనకే ‘భూ భారతి’
పాన్‌గల్: నిజమైన హక్కుదారులకు భూ భారతి చట్టం అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో భూ భారతి చట్టం–2025పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల ప్రక్షాళనకు భూ భారతి చట్టం తీసుకొచ్చిందని, పాత చట్టంలోని లొసగులను సవరిస్తూ కొత్త చట్టం రూపొందించినట్లు చెప్పారు. గతంలో ధరణి చట్టాన్ని అడ్డుపెట్టుకొని అనేక భూ ఆక్రమణలు జరిగాయని.. వాటన్నింటిని భూ భారతి చట్టం ద్వారా సరిచేసి ప్రభుత్వ భూములను కాపాడుతామని చెప్పారు. ధాన్యం కాంటా, తరుగు పేరుతో రైతులకు ఇబ్బందులు కలిగించొద్దని మంత్రి అధికారులను ఆదేశించారు. అత్యంత పేదవారిని గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని సూచించారు. కమిటీ సభ్యులు, అధికారులు నిజాయతీగా వ్యవహరిస్తూ అర్హులకే ప్రాధాన్యం ఇవ్వాలని.. అనర్హులను ఎంపిక చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని.. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చదివించి బలోపేతానికి సహకరించాలని కోరారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన 70 మంది లబ్ధిదారులకు రూ.21,59,500 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు మంత్రి అందజేశారు.
కొత్త చట్టం గురించి వివరించేందుకే అవగాహన సదస్సులు..
ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టం గురించి ప్రజలకు వివరించేందుకే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ధరణిలోని సమస్యల పరిష్కారానికి మేధావులతో చర్చించి పటిష్ట భూ భారతి చట్టం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అఽధికారులు తప్పు చేస్తే చర్యలు తీసుకొని తప్పును సరిచేసే అవకాశం కొత్త చట్టంలో ఉందన్నారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, డీఏఓ గోవింద్‌నాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీపీఆర్‌ఓ సీతారాంనాయక్, తహసీల్దార్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ గోవిందరావు, ఏఓ రాజవర్ధన్‌రెడ్డి, మండల నాయకులు వెంకటేష్‌నాయుడు, రవికుమార్, మధుసూదన్‌రెడ్డి, రాముయాదవ్, పుల్లారావు, భాస్కర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.