అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

May 3 2025 8:21 AM | Updated on May 3 2025 8:21 AM

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి

నాగర్‌కర్నూల్‌: జిల్లాలో అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణరావుతో కలిసి భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, నీట్‌ పరీక్ష ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీసీ నిర్వహించారు. వీసీ అనంతరం కలెక్టర్‌ జిల్లా అధికారులతో మాట్లాడుతూ జిల్లాలో భూ భారతి చట్టం అమలు చేయనున్న మండలంలోని గ్రామాల్లో రైతుల నుంచి భూ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన మండలంలోని ప్రతి గ్రామంలో హెల్ప్‌ డెస్క్‌, దరఖాస్తు సెంటర్లు ప్రారంభించాలని, అధికారులు గ్రామాలకు వెళ్లే ముందు ప్రజలందరికీ తెలిసేలా చాటింపు వేయించాలని, దరఖాస్తు ఫారాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా త్వరితగతిన పూర్తిచేసి జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఆమోదం తీసుకోవాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాలో నిరుపేదలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనర్హులను ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిక చేయవద్దని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటించాలని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా అందిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్‌, దేవసహాయం తదితరులు పాల్గొన్నారు.

నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకోవాలి

నాగర్‌కర్నూల్‌ రూరల్‌: మండలంలోని పెద్దాపూర్‌లో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. గ్రామంలో పలువురు లబ్ధిదారులకు చెందిన నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పనులను అదనపు కలెక్టర్‌ దేవసహాయం, ఎంపీడీఓ కోటేశ్వర్‌తో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులతో కలెక్టర్‌ మాట్లాడారు. ఇళ్ల నిర్మాణం చేపట్టి ఎన్ని రోజులు అవుతుందని నిర్మాణానికి మెటీరియల్‌ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారని, ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయ్యిందని ఆరా తీశారు. పూర్తయిన ఇళ్లకు లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష జమ చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement