
భూ సమస్యల పరిష్కారానికే..
బిజినేపల్లి: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలు పరిష్కారమవుతాయని అదనపు కలెక్టర్ పి.అమరేందర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జూన్ 2 నుంచి గ్రామాల్లో గ్రామసభలు ఏర్పాటు చేసి రైతుల భూ సమస్యలు పరిష్కారం చేస్తారని.. రెవెన్యూ అధికారులే స్వయంగా గ్రామాలకు వస్తారన్నారు. ఽగ్రామసభల నిర్వహణ తేదీలను ముందుగానే గ్రామ ప్రజలకు చాటింపు ద్వారా తెలియజేస్తారని చెప్పారు. భూ సమస్యలు పరిష్కరించడానికి ఇదో సరైన సమయమని వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సురేష్, తహసీల్దార్ శ్రీరాములు, ఉప తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ కతలప్ప, ఏఓ నీతి, రైతులు పాల్గొన్నారు.
భూ భారతితో సమస్యలు పరిష్కారం..
తెలకపల్లి: భూ భారతి ద్వారా రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం భూముల ధరలు పెరగడంతో గ్రామాల్లో భూ సమస్యలు పెరిగాయని.. రైతులు ఏ సమస్యలున్నా ముందుగా తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే పరిష్కరిస్తారని, అక్కడ పరిష్కారంగాకపోతే ఆర్డీఓ, కలెక్టర్‌స్థాయిలో పరిష్కరిస్తారని చెప్పారు. త్వరలో గ్రామ పాలన అధికారులను నియమిస్తామని తెలిపారు. రైతులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ సురేష్, సింగిల్‌విండో వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ చిన్నజంగయ్య, తహసీల్దార్ జాకీర్ అలీ, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు