కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. గురువారం జిల్లావ్యాప్తంగా 33 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. 6,201 మంది విద్యార్థులకు గాను 5,846 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 4,454 మందికి గాను 4,228 మంది, ఒకేషనల్ విభాగంలో 1,747 మందికి గాను 1,618 మంది హాజరై పరీక్షలు రాశారు. ఆయా విభాగాల్లో మొత్తం 355 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.
వేరుశనగ @ రూ.6,929
కల్వకుర్తి రూరల్/జడ్చర్ల: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుశనగ పంటకు గురువారం అత్యధికంగా రూ.6,929 ధర లభించింది. కనిష్టంగా రూ.5,010 రాగా.. సరాసరిగా రూ.6,370 ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్కెట్‌కు 551 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది.
● బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం వేరుశనగ క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,989, కనిష్టంగా రూ.5,363 ధరలు లభించాయి. కందులు గరిష్టంగా రూ.6,800, కనిష్టంగా రూ.4,000, మొక్కజొన్న గరిష్టంగా రూ.2,304, కనిష్టంగా రూ.2,165, పెబ్బర్లు గరిష్టంగా రూ.6,010, కనిష్టంగా రూ.5,450, జొన్నలు రూ.3,889, పొద్దుతిరుగుడు రూ.4,250, ఆముదాలు రూ.6,151, మినుములు గరిష్టంగా రూ.7,262, కనిష్టంగా రూ.7,222 ధరలు లభించాయి.
ఉచిత శిక్షణకు దరఖాస్తులు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ద్వారా నెలరోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో ఈనెల 15 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టు వచ్చే నెల 12వ తేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు.
వచ్చే నెల 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఓపెన్ స్కూల్ ద్వారా చదివే పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఏప్రిల్ 20 నుంచి వార్షిక పరీక్షలు ఉంటాయని డీఈఓ ఎ.ప్రవీణ్‌కుమార్, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ శివయ్య ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. పదో తరగతికి సంబంధించి వచ్చే నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. అలాగే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వచ్చే నెల 26 నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఆయా రోజుల్లో విద్యార్థులందరూ తప్పక హాజరు కావాల్సి ఉంటుందని సూచించారు.
పీఏసీఎస్‌ను సందర్శించిన డీసీసీబీ చైర్మన్
ఉప్పునుంతల: స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్)ను గురువారం డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి సందర్శించారు. పీఏసీఎస్ ద్వార సంఘం సభ్యులకు ఇస్తున్న స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు, ఇతర కార్యకలాపాలను పరిశీలించారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ పురుషోత్తంరావు, ఏజీఎం భూపాల్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సత్తు భూపారావు అచ్చంపేట, కొండనాగుల, అంబట్‌పల్లి పీఏసీఎస్‌ల చైర్మన్లు రాజిరెడ్డి, జబ్బు నర్సయ్య, హన్మంత్‌రెడ్డి, అచ్చంపేట డీసీసీబీ మేనేజర్ రవికుమార్, పీఏసీఎస్ సీఈఓ రవీందర్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు 355 మంది గైర్హాజరు