కాళేశ్వరం: సరస్వతీనది ఆది పుష్కరాల్లో జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని.. అంత్య పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణకు వన్‌వే రూట్ ప్లానింగ్ చేసినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఈనెల 21నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్య పుష్కరాల నేపథ్యంలో భక్తుల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక సదుపాయాలపై అడిషనల్ ఎస్పీ నరేష్‌కుమార్‌తో కలిసి కాళేశ్వరంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా వీఐపీఘాటు, సాధారణ ఘాటు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఘాట్‌ల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, 250కి పైగా సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షిస్తామన్నారు. పోలీసుస్టేషన్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించనున్నామని తెలిపారు. 12 రోజుల పాటు 2,500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తులో పలు షిప్టుల్లో ఉంటారన్నారు. వాహనాల పార్కింగ్ కోసం సుమారు 250 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వర్షం కురిస్తే వాహనాలు దిగబడకుండా ఎరుపు నేలలను కూడా గుర్తించినట్లు తెలిపారు.
గంగారం ఎక్స్‌రోడ్డు నుంచి కాళేశ్వరం
మంథని గుండా కాళేశ్వరం వచ్చే వాహనాలు గంగారం ఎక్స్‌రోడ్డు మీదుగా దామెరకుంట, అన్నారం, మద్దులపల్లి మీదుగా కాళేశ్వరం వస్తాయి. వరంగల్ నుంచి వచ్చే వాహనాలు బస్వాపూర్ నుంచి రుద్రారం మీదుగా కొయ్యూర్, గంగారం ఎక్స్‌రోడ్డు నుంచి దామెరకుంట, అన్నారం మీదుగా కాళేశ్వరం వస్తాయి. తిరిగి వెళ్లేటప్పుడు కాళేశ్వరం మీదుగా యధావిధిగా కాటారం గుండా వరంగల్, కరీంనగర్ వైపునకు వెళ్తాయి. ఆర్టీసీ బస్సులు, వీవీఐపీ వాహనాలకు వన్‌వే లేదు. ఎప్పటిలాగే వచ్చి వెళ్తాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మంచిర్యాల గుండా వచ్చే వాహనాలు వంతెన వద్ద పార్కింగ్ స్థలాలకు చేరుకుంటాయి. అక్కడే పార్కింగ్ చేసిన తరువాత ఆటోలు, షెటిల్ బస్సులలో వెళ్లి స్నానాలు చేసి దర్శనం చేస్తారని తెలిపారు.
భక్తులకు ఇబ్బంది కలగొద్దు
వన్‌వే ద్వారా భక్తులకు సులభంగా రాకపోకలు జరిగేలా రహదారుల అభివృద్ధి, తాగునీటి సదుపాయాల కల్పన చేపడుతున్నామని, వారి భద్రత దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు.
అంత్య పుష్కరాలకు 2,500 మంది పోలీసులతో బందోబస్తు
250 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు
భక్తులకు ఇబ్బందులు
కలగకుండా ఏర్పాట్లు
ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్


