నానో ఎరువుల వాడకంపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

నానో ఎరువుల వాడకంపై అవగాహన

May 5 2026 6:32 AM | Updated on May 5 2026 6:32 AM

ములుగు రూరల్‌: మండల పరిధిలోని ఇంచర్ల రైతువేదికలో సోమవారం అత్మ ఆధ్వర్యంలో ఎరువుల యాజమాన్య పద్ధతులు, నానో ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త విశ్వతేజ మాట్లాడుతూ అధిక ఎరువుల వాడకంతో నేల ఆరోగ్యం దెబ్బతిని చీడపీడలు ఆశిస్తాయని తెలిపారు. పచ్చిరొట్ట ఎరువుల వాడకంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఏఓ సురేశ్‌కుమార్‌, మండల వ్యవసాయ అధికారి పరమేశ్వర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ మార్కెటింగ్‌ పద్మావతి, సర్పంచ్‌ కుమార్‌గౌడ్‌, ఆత్మ చైర్మన్‌ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతులకు అవగాహన సదస్సు

వెంకటాపురం(ఎం): రైతు వారోత్సవాలను పురస్కరించుకుని మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సును సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ మార్కెటింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పద్మావతి హాజరై రైతులనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా నాణ్యమైన విత్తన ఎంపిక, సేంద్రీయ వ్యవసాయం, యాంత్రీకరణ, మట్టి పరీక్ష, సమగ్ర ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించినట్లు వ్యవసాయ అధికారిణి శైలజ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ నవీన్‌, రైతులు జనార్దన్‌, శెట్టి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

ములుగు రూరల్‌: ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల పరిధిలోని గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్‌లో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజనల్‌ కోఆర్డినేటర్‌ హరిసింగ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరంలో కళాశాలల్లో ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీతో పాటు ఓకేషనల్‌ ఫిజియోథెరఫీ, ఏటి అండ్‌ ఐఎం కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో టీజీటిడబ్ల్యూర్‌జేసీ(బాలుర) ఏటూరునాగారం కళాశాలలో ఎంపీసీలో 40, బీపీసీలో 40, హెచ్‌ఈసీ 40, ఏటీ 20, ఏటూరునాగారం బాలికల కళాశాలలో ఎంపీసీ–40, బీపీసీ–40, సీఈసీ–40, ఏటి–20, ఐఎం 20, వాజేడులోని టీజీటీడబ్ల్యూఆర్‌జేసీలో 40, బీపీసీలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 2026లో పదో తరగతి ఉత్తర్ణీత సాధించారని వెల్లడించారు.

కాళేశ్వరాలయంలో టీపీసీసీ అధ్యక్షుడి పూజలు

కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌ దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ముందుగా త్రివేణి సంగమం వద్ద సైకత లింగార్చన, షోడస సోమవార వ్రత ఉద్యాపన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ రాజగోపురం వద్దకు రాగా అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో విశేష పూజలు చేశారు. శ్రీ శుభానందదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనను స్వామి వారి శేష వస్త్రాలతో ఆలయ చైర్మన్‌ అవధాని మోహన్‌ శర్మ సన్మానించారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందజేశారు. ఆయన వెంట టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, డీసీసీ అద్యక్షుడు బట్టు కర్ణాకర్‌, ఈఓ మహేష్‌, ఽసర్పంచ్‌ వెన్నపురెడ్డి మోహన్‌రెడ్డి, ధర్మకర్తలు ఉన్నారు.

శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో..

రేగొండ: రేగొండ మండలంలోని సుప్రసిద్ధ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహేష్‌కుమార్‌గౌడ్‌ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ఆలయ కమిటీ చైర్మన్‌ నాయినేని సంపత్‌రావు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు.

Advertisement
 
Advertisement
Advertisement