ములుగు: ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆయన సోమవారం నిర్వహించిన వీసీలో మంత్రులు వాకాటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ములుగు అదనపు కలెక్టర్ మహేందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. పీపీసీ కేంద్రాలకు మొత్తం 21.34 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం చేరగా ఇప్పటి వరకు 13.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని, హమాలీ, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులకు వాతావరణ హెచ్చరికలను నిరంతరం అందించాలని అధికారులకు సూచించారు. ఈదురుగాలులు, ఆకాల వర్షాలతో విద్యుత్ స్తంభాలు, పెద్ద పెద్ద చెట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. అనంతరం అదనపు కలెక్టర్ మహేందర్‌జీ మాట్లాడుతూ ఎఫ్‌ఏక్యూ వరిధాన్యాన్ని తక్షణమే లిఫ్టింగ్ చేయాలని ఆదేశించారు. రైతులకు ఆలస్యం లేకుండా సకాలంలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. హమాలీల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ట్రక్ షీట్లు సమయానికి జెనరేట్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌లో సివిల్ సప్లయీస్ అధికారి ఫైజల్ హుస్సేన్, డీఆర్‌డీఓ చంద్రశేఖర్, డీఎం కృష్ణవేణి, అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వీసీలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి


