ఐటీడీఏలో పాలన..
ఏటూరునాగారం: ఐటీడీఏ పాలన గాడితప్పింది. అధికారులు ధీర్ఘకాలికంగా డిప్యుటేషన్లపైనే విధులు నిర్వహిస్తున్నారు. అన్ని ఐటీడీఏల్లో పరిస్థితి ఒకలా ఉంటే ఏటూరునాగారం ఐటీడీఏ మరోలా ఉంది. ఇక్కడి అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులు, ఉన్నతాధికారుల నుంచి వచ్చే సర్క్యూలర్ల అమలు సైతం బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పీఎంఆర్‌సీ, పీఈటీసీల్లో డిప్యుటేషన్లపై పనిచేస్తున్న ఉపాధ్యాయులు తిరిగి వారి వారి పోస్టుల్లోకి వెళ్లాల్సిందిగా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి గత నెల 20న ఉత్తర్వులు జారీ చేశారు. ఉట్నూరు, భద్రాచలం ఐటీడీఏల్లో వెంటనే అమలు చేస్తే ఏటూరునాగారంలో మాత్రం పట్టించుకోవడం లేదు. పీఎంఆర్‌సీ, పీఈటీసీల్లో పనిచేసే ఉపాధ్యాయులు వారు పనిచేసే పాఠశాలలకు వచ్చి విధుల్లో చేరకుండా డిప్యుటేషన్ విధుల్లోనే కొనసాగుతున్నారు. ఇదేకాకుండా ఉట్నూరు ఐటీడీఏకు చెందిన ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఏటూరునాగారం కార్యాలయానికి డిప్యుటేషన్ వేయించుకొని ఆయన మాత్రం వరంగల్‌లోని స్టడీ సర్కిల్‌లో పనిచేస్తున్నారు. వేతనం మాత్రం ఐటీడీఏ నుంచి ఇస్తుండగా పనిచేసేది మాత్రం స్టడీ సర్కిల్‌లోనే. అయితే నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే ఉద్యోగులకు ఎలాంటి బదిలీలు, డిప్యుటేషన్లు ఉండవు. కానీ ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడం గమనార్హం.
గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఐటీడీఏ ఏర్పడినప్పుడే ఏటూరునాగారం పంచాయతీ పరిధిలోని ఎక్కెల గ్రామ శివారులో 24.20 ఎకరాలు స్థలం కేటాయించారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో 4.20 ఎకరాల్లో ఉద్యాన నర్సరీ శిక్షణ కేంద్రాలు(హెచ్‌టీసీలు) ఏర్పాటు చేశారు. వీటిలో మామిడి సపోటా, నిమ్మ, జామ తదితర పండ్ల మొక్కలు, గులాబీ, మందార వంటి పూల మొక్కలు తెచ్చి అంటుకట్టి కొత్తరకం మొక్కలు ఉత్పత్తి చేసేవారు. పండ్లు, పూల తోటల పెంపకం కోసం గిరిజనులకు ఉచితంగా అందించేవారు. వివిధ ప్రాంతాల్లో ఎంపిక చేసిన గిరిజన నిరుద్యోగ యువతకు అంటు కట్టడం , సంకరణ మొక్కలను ఉత్పత్తి చేయడంలో శిక్షణ ఇచ్చేవారు. దీంతో గిరిజన యువతకు స్వయం ఉపాధిగా ఉండేది. ప్రస్తుతం ఆ శిక్షణ కేంద్రం స్వరూపమే మారిపోయింది.
హెచ్‌టీసీ కేటాయించిన భూమి ఆక్రమణలకు గురవుతోందని ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా హయాంలో ఆ స్థలంలో పండ్లు, పూల మొక్కల పెంపకాన్ని అధికారులు చేపట్టారు. ఏటూరునాగారంలోని 4.20 ఎకరాల స్థలంలో సపోటా, నిమ్మ, మల్లెపూల మొక్కలు పెంచారు. ఎక్కెల శివారులోని 24.20 ఎకరాల స్థలాన్ని నాలుగు బ్లాకులుగా విభజించి ఒ క బ్లాకులో నర్సరీ, మిగతా బ్లాకుల్లో మోడల్ తోట లను పెంచేందుకు ప్రతిపాదించారు. ఇప్పటి వరకు మంజూరు రాలేదు. కొత్తగా వచ్చిన పీఓ లెనిన్ వత్సల్ టొప్పో ఉన్నతాధికారులతో సంప్రదించి చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.
ఆరేళ్లుగా పాలకమండలి సమావేశం నిర్వహించడం లేదు. 2019 తర్వాత ప్రతీ నాలుగు నెలలకోసారి నిర్వహించే పాలకమండలి సమావేశం ఆరేళ్లయినా నిర్వహణకు నోచుకోవడం లేదు. ఐటీడీఏ గిరిజన సంక్షేమ విద్యా విభాగంలో ఇంజనీరింగ్ విభాగాలు ఎక్కువగా ఖాళీలతో వెక్కిరిస్తున్నాయి. గిరిజన సంక్షేమం విద్యా విభాగంలో నాణ్యమైన విద్య కలగానే మారింది.
దీర్ఘకాలికంగా
డిప్యుటేషన్లపైనే ఉద్యోగులు
గిరివికాస పథకంలో బోర్లు వేసినా విద్యుత్ సదుపాయం నిల్


