15 వరకు ఉపాధి హామీ పనుల జాతర | - | Sakshi
Sakshi News home page

15 వరకు ఉపాధి హామీ పనుల జాతర

May 4 2026 10:43 AM | Updated on May 4 2026 10:43 AM

ములుగు రూరల్‌: ఈ నెల 15వ తేదీ వరకు ఉపాధి హామీ పనుల జాతర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఆర్‌డీఓ చంద్రశేఖర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పనుల జాతరలో రైతులకు వ్యక్తిగత లబ్ధి చేకూరేలా పశువులు, మేకలు, కోళ్లషెడ్లు, పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధి హామీలో పనిచేసిన కూలీలకు ఏప్రిల్‌ 15వ తేదీ వరకు పనిచేసిన వేతనాలు వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. అలాగే సిబ్బంది పెండింగ్‌ వేతనాలు సైతం చెల్లించినట్లు వెల్లడించారు. అన్ని గ్రామాల్లో చెరువుల్లో పూడికతీత మట్టిని రైతులు పొలాల్లో పోసుకోవాలని సూచించారు. పని ప్రదేశాల్లో అన్ని రకాల వసతులు కల్పించినట్లు వెల్లడించారు.

నేడు సమావేశం

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరం దేవస్థానం పాలకవర్గం(ట్రస్టుబోర్డు) నియామకం ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. సోమవారం(నేడు) ఉదయం 10 గంటలకు చైర్మన్‌ అవధాని మోహన్‌శర్మ అద్యక్షత మొదటి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 21 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల్లో చేయాల్సిన పనులు, భక్తులకు సౌకర్యాలు కల్పించుటపై చర్చించనున్నారు. పలు తీర్మానాలు చేయనున్నారని తెలిసింది.

భద్రత ఏర్పాట్లపై..

కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల భద్రత ఏర్పాట్లపై ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ పోలీసులతో సోమవారం(నేడు) సమావేశం నిర్వహించున్నారు. గతంలో ఇక్కడ పుష్కరాల్లో విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులు, ప్రస్తుతం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులతో సమీక్ష నిర్వహిస్తారని తెలిసింది.

ఆలయ నిర్మాణానికి భూమి పూజ

చిట్యాల: మండలంలోని వెంచరామి గ్రామ శివారు కుర్మపల్లి గ్రామంలో శ్రీ హనుమాన్‌ ఆలయ నిర్మాణానికి కమిటీ అధ్యక్షుడు మోరే ధర్మరాజు, సర్పంచ్‌ కాసు రమకుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఆలయ నిర్మాణం మూలంగా ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు, గ్రామస్తుల సహకారంతో అతి తొందరలోనే ఆలయాన్ని పూర్తిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు అందుగుల కుమార్‌, సట్ల స్వామి, కార్యదర్శి గుర్రం నరేందర్‌, కోశాధికారి జక్కే వెంకటేశం పాల్గొన్నారు.

సంఘాల వైఫల్యంతోనే కష్టాలు

భూపాలపల్లి అర్బన్‌: ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ సంఘాల వైఫల్యంతోనే సింగరేణికి కష్టాలు మొదలైనట్లు సింగరేణి కోల్‌మైన్‌ కార్మిక సంఘ్‌(బీఎంఎస్‌) కార్యదర్శి మాధవనాయక్‌ ఆరోపించారు. ఏరియాలోని బీఎంఎస్‌ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు గత ప్రభుత్వాల విధానాలు, గుర్తింపు సంఘాల వైఫల్యమే ప్రధాన కారణమని ఆరోపించారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థలు చెల్లించాల్సిన సుమారు రూ.50వేల కోట్ల బకాయిలను వెంటనే వసూలు చేయడంలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. రెండేళ్లుగా గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ కార్మిక సమస్యల పరిష్కారంలో, యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందన్నారు. ఈ సమావేశంలో నాయకులు మండా రమాకాంత్‌, అప్పాని శ్రీనివాస్‌, వెలబోయిన సుజేందర్‌, సత్కూరి శ్రీనివాస్‌, శ్రీరాములు, ఓ లక్ష్మణ్‌, భాస్కర్‌, పని రమేష్‌, కటకం శ్రీనివాస్‌, మల్లేష్‌, రాజునాయక్‌, దేవర సమ్మయ్య, పునీత్‌ రావు, ప్రవీణ్‌, అడప రాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement