ఉమ్మడి వరంగల్‌లో ఎల్‌ఆర్‌ఎస్ ఇలా
వేల దరఖాస్తులు ఎల్–1లోనే.. స్పాట్ వెరిఫికేషనే సమస్య
●
మొత్తం దరఖాస్తులు (2020):
1,58,265
ఫీజు చెల్లించినవి: 1,43,121
జీడబ్ల్యూఎంసీ పరిధిలో:
96,000
మొత్తం పెండింగ్ దరఖాస్తులు:
40 శాతం పైగా
క్లియరెన్స్ దశలు: ఎల్–1, ఎల్–2, ఎల్–3
పెండింగ్ స్టేజ్: ప్రధానంగా ఎల్–1
కీలక సమస్య: స్పాట్ వెరిఫికేషన్ ఆలస్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్:
లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) అమల్లో గ్రేటర్ వరంగల్‌తోపాటు ఉమ్మడి జిల్లాలో తీవ్ర జాప్యం నెలకొంది. 2020లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం 25శాతం రాయితీ ఇచ్చింది. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం ఫీజు చెల్లించారు. 2026 మార్చి నాటికి కూడా పూర్తిస్థాయి క్లియరెన్స్ లేకపోవడం దరఖాస్తుదారులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ప్రభుత్వం మరోసారి లేఅవుట్ల క్రమబద్ధీకరణకు 25 శాతం రాయితీ ఇస్తూ జూలై 31వరకు గడువు ఇచ్చింది. ఈసారైన ఆశించిన స్థాయిలో ముందుకు వస్తారా? ఆ మేరకు ఫైళ్లు క్లియరెన్స్‌కు నోచుకుంటాయా? అన్న చర్చ జరుగుతోంది.
స్పాట్ వెరిఫికేషన్ లేక ‘బ్లాక్’...
ఐదేళ్లుగా అపరిష్కృతం...
ఫీల్డ్ స్థాయిలో స్పాట్ వెరిఫికేషన్ జరగకపోవడంతో వేలాది ఫైళ్లు ముందుకు కదలడం లేదు. అధికారులు రేపు, మాపు అంటూ నెలల తరబడి వాయిదా వేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా ఐదేళ్లయినా పూర్తిస్థాయిలో ఫైళ్లు పరిష్కారానికి నోచుకోలేదన్న ఫిర్యాదులున్నాయి. ‘గ్రేటర్‘ మున్సి పల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)తో పాటు ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా 1.58 లక్షల దరఖాస్తులు రాగా, ఇందులో 1.43 లక్షల మంది ఫీజు చెల్లించారు. ఇప్పటికీ కూడా 40శాతం ఫైళ్లు పెండింగ్‌లోనే ఉండగా.. రాయితీ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందంటున్నారు. ప్రభుత్వం 25శాతం రాయి తీ ప్రకటించి ప్రజలను ప్రోత్సహించినా, క్లియరెన్స్ లేకపోవడంతో ఆ ప్రయోజనం వృథా అవుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎల్–1లోనే ఎల్‌ఆర్‌ఎస్ లాక్...
2026లో మళ్లీ రాయితీ ప్రకటించినప్పటికీ, పాత దరఖాస్తులు క్లియర్ కాకపోవడం వల్ల కొత్త ప్రకటనపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రాయితీతో భారీగా రుసుములు వసూలు చేసినప్పటికీ, వాటిలో సుమారు 40 శాతం దరఖాస్తులు ఇప్పటికీ ఎల్–1 దశలోనే పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్–1 నుంచి ఎల్–2, ఎల్–3 దశలకు ఫైళ్లు వెళ్లడంలో ఆలస్యం ప్రధాన సమస్యగా మారిందని అధికారులే చెబుతున్నారు. ప్రధానంగా మూడు శాఖల మధ్య కుదరని సమన్వయం కూడా దరఖాస్తుదారులకు శాపంగా మారుతుందంటున్నారు. అధికారులు మాత్రం నిబంధనల ప్రకారం దశల వారీగా క్లియరెన్స్ జరుగుతోందని, త్వరలో పరిష్కరిస్తామని చెబుతున్నారు.
మరోసారి రాయితీ.. 25% రిబేట్ ఇస్తూ ఉత్తర్వులు
జూలై 31 వరకు గడువు...
పాత దరఖాస్తుదారులకే చాన్స్
ఫైళ్ల పరిష్కారంపైనే అనుమానాలు..
గతంలో ఫీజు చెల్లించినవే అపరిష్కృతం
ఇప్పటికీ పెండింగ్‌లో
40శాతం దరఖాస్తులు
మళ్లీ 25 శాతం రాయితీ..
ఐదేళ్లు గడిచినా పూర్తిస్థాయి క్లియరెన్స్ జరగనప్పటికీ తాజాగా ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై 25శాతం రాయితీ మళ్లీ అమల్లోకి తెచ్చింది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ రాయితీ జూలై 31 వరకు ఉంటుంది. కొత్తగా అప్లై చేసే వారికి ఈ రాయితీ వర్తించదు. పాత దరఖాస్తుదారులకు మాత్రమే ప్రయోజనం. ఇదిలా ఉండగా గతంలో ఫీజు చెల్లించిన దరఖాస్తులే ఇంకా అపరిష్కృతంగా ఉండగా.. అందుకు అనేక కారణాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయకపోవడం, ఎఫ్‌టీఎల్(చెరువుల పరిధి), నిషేధిత భూముల వివాదాలు, పేర్లు, సర్వే నంబర్లలో పొరపాట్లు, ఫీల్డ్ వెరిఫికేషన్ ఆలస్యం తదితర కారణాలు చెబుతున్నారు. రాయితీ ఇవ్వడం కాదు.. స్పాట్ వెరిఫికేషన్‌కు ప్రత్యేక బందాలు ఏర్పాటు చేసి పెండింగ్ దరఖాస్తులను వేగంగా క్లియర్ చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఆన్‌లైన్ సమస్యలు పరిష్కరించి , పారదర్శకత పెంచాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.


