వాజేడు: ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో శనివారం వాజేడు, పేరూరు వైద్యశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలకు వచ్చిన ఆయన ముందుగా హాజరు పట్టికలను పరిశీలించారు. విధులకు రాని సిబ్బందిపై ఆరా తీశారు. మందుల గదులు, రోగుల బెడ్లు, ఆస్పత్రుల్లోని అన్ని గదులను నిశితంగా పరిశీలించారు. మందులు అందుబాటులో ఉన్నది లేనిది సిబ్బందిని అడిగి తెలుసుకోవడంతో పాటు ఇన్, అవుట్ పేషెంట్ల రిజిస్టర్లను పరిశీలించారు. పేరూరు వైద్యశాలలో అందుబాటులో లేని సిబ్బందిపై ఆరా తీశారు. డీఎంహెచ్‌ఓతో మాట్లాడుతానని తెలిపారు. వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
దళారులకు విక్రయించి మోసపోవద్దు
మల్హర్: ఽరైతులు ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించి మద్దతు ధర పొందాలని జిల్లా సహకార అధికారి వాల్యనాయక్ అన్నారు. కాటారం మండలంలోని కాటారం, కొత్తపల్లి శంకరంపల్లి, ధన్వాడ సెంటర్లను కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల, సర్పంచ్‌లతో కలిసి వాల్యనాయక్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీఓ మాట్లాడుతూ.. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు సెంటర్ల వద్ద మౌలిక వసతుల కల్పనతో పాటు నగదు జమ అయ్యేవరకు సంబంధిత వ్యవసాయ అధికార యంత్రాంగం పూర్తి బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పీఏసీఎస్ ప్రత్యేక అధికారి రాజు, సీఈఓ ఎడ్ల సతీష్ సర్పంచ్‌లు పంతకాని సడవలి, సర్పంచ్ అజ్మీర కిషన్‌నాయక్, మహేష్‌కుమార్, అరుణస్వామి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు
ఘన సన్మానం
భూపాలపల్లి అర్బన్: పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులను శనివారం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రవి అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా సాయి చరణ్ 540, ఎండీ హఫీజ్ 534, ఎస్.హర్షవర్ధన్ 529, సాయి వరుణ్ 508, టి.అభిలాష్ 508, నవాజుద్దీన్ 502 ఉత్తమ ఫలితాలు సాధించగా కోఆర్డినేటర్ రాజశేఖర్, ఉపాధ్యాయ బృందం విద్యార్థులను శాలువాలు, మొమెంటోలతో ఘనంగా సన్మానించారు.
12న తెలంగాణ జనసమితి ప్లీనరీ
భూపాలపల్లి రూరల్: ఈనెల 12న హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార్‌లో నిర్వహించనున్న తెలంగాణ జన సమితి నాలుగో రాష్ట్ర ప్లీనరీని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రత్నం కిరణ్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం రత్నం కిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు తెలంగాణ జన సమితి నిరంతరం పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య, పార్టీ నాయకులు దాసరి జనార్దన్, రాళ్లపల్లి బాపు పాల్గొన్నారు.
గుడుంబా పట్టివేత
రేగొండ: గుడుంబా విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు కొత్తపల్లిగోరి ఎస్సై సాయి త్రిలోక్‌నాథ్ రెడ్డి శనివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చెన్నపూర్‌కు చెందిన పల్లెబోయిన శంకర్ గుడుంబా విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు దాడి చేసి 4 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


