● అదనపు కలెక్టర్ మహేందర్ జీ
ములుగు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నట్లు అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్ జీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీఓ వెంకటేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంపత్ రావుతో కలిసి హాజరయ్యారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి వివరాలను పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మహేందర్‌జీ మాట్లాడుతూ ప్రజాపాలన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జనగణనలో భాగంగా ప్రతిఒక్కరూ మే 10వ తేదీ వరకు సాగుతున్న సెల్ఫ్ ఎమ్యునరేషన్‌లో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అదనపు కలెక్టర్ సంపత్ రావు మాట్లాడుతూ, అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్‌పర్సన్ ఆసియా షాహిన్, డీఎస్పీ రవీందర్, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, జిల్లా అధికారులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ముందస్తు జాగ్రత్తలతో ప్రమాదాల నివారణ
విద్యుత్ ప్రమాదాలు నివారణకు రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అదనపు కలెక్టర్ మహేందర్ జీ తెలిపారు. విద్యుత్ భద్రతా వారోత్సవాల సందర్భంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల) సంపత్ రావు, టీజీఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ భిక్షపతితో కలిసి సేఫ్టీ వాల్‌పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం పంపుసెట్లను, విద్యుత్ మోటర్లను, ఇనుప పైపులను, ఫుట్‌వాల్‌లను ఏమరపాటుగా తాకకూడదని తెలిపారు. వాటిల్లో విద్యుత్ సరఫరా ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలను, తెగిపడిన తీగలను, స్టార్టర్ డబ్బాలను ముట్టుకోకూడదని వివరించారు. అగ్ని ప్రమాదం సంభవిస్తే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, డీఎస్పీ రవీందర్, డీఈపీ నాగేశ్వరరావు, మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చంద్రకళ, వైస్ చైర్‌పర్సన్ ఆసియా షహీన్, డీపీఆర్వో రఫిక్ పాల్గొన్నారు.


