● ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్
గోవిందరావుపేట: ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి విద్యా–వైజ్ఞానిక శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని పస్రా గ్రామంలో ప్రజాసంఘాల కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ ఆధ్వర్యంలో కరపత్రాన్ని శనివారం ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్‌ఎఫ్‌ఐ నిరంతరం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తుందన్నారు. ఈ మేరకు ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సామాజిక చైతన్యం, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడమే లక్ష్యమన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సమాజాన్ని అర్ధం చేసుకుని సమకాలిన సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ శిక్షణ తరగతుల్లో చరిత్ర, రాజకీయం, ఆర్థిక వ్యవస్థ, సైన్స్ వంటి విభిన్న అంశాలపై నిపుణులు బోధిస్తారని వివరించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 12 విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు తరలివచ్చి శిక్షణ తరగతుల్లో పాల్గొనాలని కోరారు.


