మంగపేట : మండల పరిధిలోని శ్రీ హేమాచలక్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం గురువారం రాత్రి కనులపండువగా నిర్వహించారు. ఆలయంలో కొనసాగున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఇన్‌చార్జ్ ఈఓ వీరస్వామి, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో గురువారం ఉదయం భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆలయ ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం నిత్య ఆరాధన, చతుస్థానార్చన, యాగశాలలో నిత్య హోమాలు, సుదర్శన హోమం, రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో స్నపనం(అభిషేకం) కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం బలిహరణ కార్యక్రమం అనంతరం శుక్రవారం మధ్యాహ్నం జరుగనున్న స్వామివారి తిరుకల్యాణం సందర్భంగా రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణంలోని స్వామివారి కల్యాణ మండపంలో స్వామివారు, ప్రత్యేక పల్లకిలో ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు భక్తజనుల మధ్య ఉత్సవ మూర్తులకు వేద మంత్రోచ్చరణ నడుమ శాస్త్రోకంగా ఎదుర్కోలు మహోత్సవాన్ని కనులపండువగా జరిపించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారి ఎదుర్కోలు మహోత్సవ కార్యక్రమం ఇతివృత్తాన్ని వివరించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకి(సేవ)పై మల్లూరు గ్రామంలో భక్తులను దర్శించుకునేందుకు వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ సురేశ్, శ్రీకృష్ణయజుర్వేదం పండితులు వరప్రసాధ్, శ్రీరంగం వెంకటాచార్యులు, బరధ్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహాచార్యులు, మణిదీపాచార్యులు, విరంచి, ఆలయ పూజారులు ముక్కామల రాజశేఖర్‌శర్మ, అనిపెద్ది రాజీవ్, కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు, ఏడునూతుల ఈశ్వర్‌చంద్, ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారాములు, రికార్డు అసిస్టెంట్ లక్ష్మినారాయణ, శివరాజు శేషు, సిబ్బంది పుల్లయ్య, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా సుదర్శన హోమం
హేమాచలక్షేత్రంలో కొనసాగుతున్న జాతర


