ములుగు రూరల్: జిల్లా కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బోర్ఖడే హేమంత్ సహదేవరావును గురువారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టే కార్యక్రమాలతో పాటు పలు ఇతర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పరస్పర సహకారంతో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్ల డించారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, సీఐ సురేశ్, ఎస్సై శంకర్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ములుగు రూరల్: జిల్లాలోని రూరల్, ట్రైబల్ వెల్ఫేర్ మినీ గురుకులాల్లో 2026–27 విద్యా సంవత్సరంలో చేరేందుకు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకులాల ప్రాంతీయ సమన్వయకర్త హరిసింగ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని జాకారంలో ఒకటవ తరగతిలో 30, రెండో తరగతిలో 10, మూడులో 10, ఐదులో 10 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వివరించారు. ఎస్‌ఎస్ తాడ్వాయిలోని పోచాపూర్‌లో ఒకటవ తరగతిలో 30, రెండో తరగతిలో 13, మూడు, నాలుగో తరగతిలో 5, ఐదో తరగతిలో 7 సీట్లు ఉన్నాయని వెల్లడించారు. అలాగే వాజేడులో ఒకటవ తరగతిలో 30, రెండో తరగతిలో 9, మూడో తరగతిలో 3, నాల్గో తరగతిలో ఒకటి, ఐదో తరగతిలో 4 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. అడ్మిషన్లకు 5వ తేదీ వరకు అవకాశం ఉందని తెలిపారు.
ఇద్దరికి జైలుశిక్ష
ములుగు రూరల్: జిల్లాలో గంజాయి, పొక్సో కేసులో ఇరువురికి జైలుశిక్ష ఖరారు అయినట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పస్రా పోలీస్ స్టేషన్‌లో మంగపేట మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సూర్యప్రకాశ్‌పై గంజాయి కేసు నమోదు కాగా పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.5వేల జరిమానా కోర్టు విధించినట్లు తెలిపారు. అదే విధంగా వెంకటాపురం(ఎం) మండలం కొండాపూర్‌కు చెందిన రజినీకాంత్‌కు పొక్సో కేసులో రెండేళ్ల జైలుతో పాటు రూ.4,200 జరిమానాను కోర్టు విధించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో నిందితులకు శిక్షపడే విధంగా కృషి చేసిన దర్యాప్తు అధికారులు శంకర్, తాజుద్దీన్‌లను ఆయన అభినందించారు.
విదేశాల్లో
ఉద్యోగావకాశాలు
ఏటూరునాగారం: విదేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు ఐటీడీఏ ద్వారా అవకాశాలను కల్పిస్తున్నట్లు పీఓ లెనిన్ వత్సల్ టొప్పో గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మాన్పవర్ కంపెనీ ద్వారా ఆస్ట్రేలియా, జర్మనీ, ఓమన్ వంటి విదేశాల్లో ఉద్యోగాలు చేసే గిరిజన నిరుద్యోగ యువతీయువకుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. సపర్రయ్ ప్రింటర్, పానేల్ బెటర్, ఆటోమెటిక్ మెషిన్ కార్స్, వెల్డర్ కంపెనీలలో ఆస్ట్రేలియాలో పనిచేసేందుకు సుమారు 500ల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జర్మనీలోని ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, నుర్సెన్ కంపెనీలలో సుమారు 230 వరకు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.


