డిజిటల్‌ జనగణనకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ జనగణనకు సిద్ధం

May 2 2026 11:25 AM | Updated on May 2 2026 11:25 AM

ములుగు: జిల్లాలో జనగణనను డిజిటల్‌ విధానంలో సమర్థవంతంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు తెలిపారు. కలెక్టరెట్‌లో జనగణనపై కలెక్టర్‌ గురువారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జనగణన ప్రక్రియలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ముఖ్యంగా స్వీయ నమోదు ద్వారా ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలని ప్రజలను కోరారు. జనగణన రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశలో హౌస్‌ లిస్టింగ్‌ స్వీయ గణన 26వ తేదీ నుంచి మే 10 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 807 హౌస్‌ లిస్టింగ్‌ బ్లాకులు గుర్తించామని, ప్రతీ బ్లాక్‌లో సుమారు 300 ఇళ్లు, 800 జనాభా ఉంటుందని వివరించారు. ఈ ప్రక్రియకు 545 మంది ఎన్యుమరేటర్లు, 97 మంది సూపర్‌వైజర్లను (రిజర్వ్‌తో సహా) నియమించినట్లు తెలిపారు. స్వీయ నమోదుకు ఎస్‌ఈ.సీఈఎన్‌ఎస్‌యుఎస్‌.జీఓవీ.ఐఎన్‌ పోర్టల్‌లో కుటుంబంలోని ఒక సభ్యుడు లాగిన్‌ అయి వివరాలు నమోదు చేయవచ్చని తెలిపారు. నమోదు చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా వివరాలు నమోదు చేయాలని, ఒకసారి నమోదు చేసిన తర్వాత సవరణకు అవకాశం ఉండదని సూచించారు. నమోదు చేసిన మొబైల్‌ నంబర్‌కు 11 అంకెల సంఖ్య వస్తుందని, ఆ సంఖ్యను ఎన్యుమరేటర్‌కు అందజేయాలని తెలిపారు. ఏమైనా తప్పులు ఉంటే ఎన్యుమరేటర్‌ ద్వారా మాత్రమే సవరించుకోవచ్చని స్పష్టం చేశారు. డిజిటల్‌ విధానంలో జరుగుతున్న ఈ జనగణనలో డేటా గోప్యతకు పూర్తి భద్రత ఉంటుందన్నారు. స్వీయ నమోదు ద్వారా వేగవంతంగా, ఖచ్చితమైన డేటా సేకరణ సాధ్యమవుతుందని వెల్లడించారు. స్వీయ నమోదుకు చివరి తేదీ మే 10 అని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ సీహెచ్‌. మహేందర్‌ జీ, డీపీఆర్వో రఫిక్‌, కలెక్టరేట్‌ అధికారి మంజుల, జనగణన పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు

Advertisement
 
Advertisement
Advertisement