వైభవంగా హేమాచలుడి తిరుకల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా హేమాచలుడి తిరుకల్యాణం

May 2 2026 8:20 AM | Updated on May 2 2026 8:20 AM

భారీగా తరలివచ్చిన భక్తులు

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క

మంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధి గాంచిన మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో లక్ష్మీనర్సింహాస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వాహణ ఇన్‌చార్జ్‌ అధికారి ఎం.వీరస్వామి, చీఫ్‌ పెస్టివల్‌ ఆఫీసర్‌ శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో లక్ష్మీనర్సింహాస్వామి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల కల్యాణ మహోత్సవాన్ని భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకుడు అమరవాది మురళీ కృష్ణమాచార్యుల బృందం వేద మంత్రోశ్ఛరణ నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు ప్రధానాలయంలోని స్వయంభు స్వామివారిని నూతన వస్త్రాలంకరణ చేసి నిత్యారాదన, తిరు కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. సుమారు రెండు గంటల పాటు స్వామివారి కల్యాణ మహోత్సవ క్రతువును నిర్వహించారు. 12.30 గంటలకు అభిజిత్‌ లగ్నంలో జిలకరబెల్లం, మాంగళ సూత్రదారణ, ముత్యాల తలంబ్రాలతో స్వామివారి కల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు.

హేమాచలుడికి

పట్టువస్త్రాలు అందించిన మంత్రి సీతక్క

హేమాచల లక్ష్మీనర్సింహాస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి మంత్రి ధనసరి సీతక్క, ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌, ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌తో కలిసి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందించారు. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున ఆలయ ఈఓ వీరస్వామి, ఉత్సవకమిటీ చైర్మన్‌ యరంగారి సురేష్‌, పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌ దంపతులు, జిల్లా గ్రథాలయ చైర్మన్‌ భానోతు రవిచందర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, రేగ కల్యాణి, ములుగు ఆర్డీ వెంకటేష్‌, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్‌బట్‌, టీఎస్‌ ఈజీసీ డైరెక్టర్‌ గుమ్మడి సోమయ్య, ఆలయ పూజారులు ముక్కామల శేఖర్‌ శర్మ, కారంపుడి పవన్‌కుమార్‌, బ్రహ్మోత్సవాల యాగ్నికులు అనిపెదిద రాజీవ్‌శర్మ, ఏడునూతుల ఈశ్వర్‌చంద్‌ రామానుజం, సీతారాములు, గోనె లక్ష్మినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

ఆలయాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తాం..

2027లో జరిగే స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం నాటికి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి ధనసరి సీతక్క తెలిపారు. 2027లో జాతరతో పాటు, గోదావరి పుష్కరాల నిర్వాహణ ఉండటంతో పెద్ద ఎత్తున నిధులు కెటాయించాలని ప్రభుత్వాన్ని కోరామని, ఆయా నిధులతో రోడ్లు, పుష్కరఘాట్‌ల అభివృద్ధితో పాటు నూతనంగా గ్రానైట్‌తో శాశ్వత నిర్మాణం పనులు చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. కాగా జాతరకు ఆర్టీసీ బస్సులు అవసరమైన మేరకు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు ఎర్రటి ఎండలో పార్కింగ్‌ స్థలాల నుంచి గుట్టపైకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్‌ ఎస్సై టీవీఆర్‌ సూరీ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకు వెల్లడంతో ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. పోలీస్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖ అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

హేమాచల క్షేత్రంలో శ్రీచక్రానికి అవమానం

హేమాచల క్షేత్రంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల సాక్షిగా హిందూ తంత్రశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన శ్రీ చక్రం యంత్ర శిలకు అవమానం జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరం క్రితం ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తీసుకువచ్చిన చక్రాన్ని ఆలయ అధికారులు ప్రాంగణంలోని ఆర్చీ పక్కన పడేశారు. దాని పవిత్రతను తెలియని కొందరు అక్కడే పాదరక్షలు వదిలారు. ఇది చూసిన ఆంజనేయస్వామి భక్తులు అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. తక్షణమే స్పందించి ప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement