బాల్యవివాహాల నిర్మూలనలో మహిళల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాల నిర్మూలనలో మహిళల పాత్ర కీలకం

May 2 2026 8:20 AM | Updated on May 2 2026 8:20 AM

ఏటూరునాగారం: బాల్య వివాహాల నిర్మూలనలో మహిళా గ్రూపు సభ్యుల పాత్ర కీలకమని ఐకేపీ ఏపీఎం శ్రీధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని చైతన్య మండల సమాఖ్య కార్యాలయంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా బాలల భద్రత, సంరక్షణ–డ్రగ్స్‌ నిర్మూలన, సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా సీసీలకు, వీఓఏలకు అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామాల్లో ప్రతీ ఇంటిలో ఒక గ్రూపు సభ్యురాలు ఉంటుందని, బాల్యవివాహాలతో జరిగే నష్టాలు, అనార్థాలను వివరించి అటువైపు వారి దృష్టి వెళ్లకుండా చేయాలన్నారు. అనంతరం ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పుష్పవతి, బాలల పరిరక్షణ ప్రొటెక్షన్‌ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ కిశోర బాలికల సమాచారం, స్నేహ క్లబ్‌ల ఏర్పాటులో అంగన్‌వాడీ టీచర్ల సహకారం గూర్చి వివరించారు. కిశోర బాలికలు వయస్సు పరంగా వచ్చే ఆకర్షణలతో అమాయకత్వంతో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు. బాలికలు ఏమైన ఇబ్బందులు ఉంటే 1098 టోల్‌ ఫ్రీనంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.

తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయాలి

ఏటూరునాగారం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ (టీపీఎస్‌) ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరునాగారం మండలకేంద్రంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రోగ్రెస్సివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె నాగరాజు డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకేంద్రంలో ఇప్పటికే యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల ఏర్పాటు చేస్తున్నారని, ఇప్పుడు టీపీఎస్‌ కూడా జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయడం వలన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు నష్టపోతారన్నారు. ఇది భవిష్యత్‌లో విద్యాపరంగా ప్రాంతీయ అసమానతలు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఏటూరునాగారం మండలకేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్‌ పాఠశాలలో తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఆట స్థలం, తరగతులు ఉన్నాయన్నారు. దీనిపై విద్యార్థి సంఘాలను కలుపుకొని జిల్లా విద్యాశాఖ అధికారి, కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం ఇస్తామన్నారు.

కల్యాణం.. కమనీయం

రేగొండ: కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతీ నెలలో కోటంచ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కల్యాణం నిర్వహిస్తారు. శుక్రవారం అభిషేకంతో ప్రారంభమై, సుదర్శన నారసింహ హోమం కొనసాగించారు. అనంతరం కల్యాణాన్ని నిర్వహించారు. ఆరగింపుతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో అర్చకులు బుచ్చమాచార్యులు, శ్రీనాధచార్యులు, ఆలయ సిబ్బంది శ్రావణ్‌, సుధాకర్‌, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

జిల్లా ప్రధాన

న్యాయమూర్తికి సన్మానం

భూపాలపల్లి అర్బన్‌: 23 ఏండ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్‌ రమేష్‌బాబు శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా భూపాలపల్లి బార్‌ అసోసియేషన్‌, కోర్టు సిబ్బంది ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి పలువురు న్యాయమూర్తులు హాజరై రమేష్‌బాబు సేవలను, వారి ఆదర్శప్రాయ జీవితాన్ని కొనియాడారు. విశ్రాంత జీవితంలో కూడా సమాజ సేవ కొనసాగించాలని ఆకాంక్ష వ్యక్తంచేశారు. అనంతరం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్జి సతీమణి అనంతలక్ష్మి, ములుగు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌వీపీ సూర్యచంద్ర, వరంగల్‌ ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మల గీతాంబ, వరంగల్‌ మొదటి అదనపు జిల్లా జడ్జి జె.మైత్రే యి, విశ్రాంత న్యాయమూర్తులు, సీనియర్‌ సివిల్‌ జడ్జి టి.కన్హయ్యలాల్‌, ప్రిన్సిపల్‌ జూని యర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌ఆర్‌ దిలీప్‌ కుమార్‌నా యక్‌, గవర్నమెంట్‌ ప్లీడర్‌ బొట్ల సుధాకర్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కూనూరు సురేష్‌కుమార్‌, ఆకుల రాములు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement