● మంత్రి సీతక్క
● ఘనంగా మేడే వేడుకలు
ములుగు: కార్మికుల శ్రమతోనే ఆర్థిక వ్యవస్థ బలపడుతోందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం జిల్లాలో మేడే వేడుకలను కార్మికులు ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణంలో హమాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకలకు మంత్రి ధనసరి సీతక్క హాజరై కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర కీలకమన్నారు. సమాజ అభివృద్ధికి కార్మికుల కృషి పునాది వంటిదని, వారి శ్రమతోనే ఆర్థిక వ్యవస్థ బలపడుతోందన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కార్మికులు ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ భిక్షపతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కౌన్సిలర్‌లు, హమాలీ సంఘం నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


