● శాస్త్రవేత్త మధు
వెంకటాపురం(కె): పంటల మార్పిడి, సేంద్రియ ఎరువుల వాడకం తో భూసారం పెరుగుతుందని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ వరంగల్ శాస్త్రవేత్త మధు అన్నారు. మండల పరిధిలోని పాత్రాపురం రైతు వేదికలో ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. సేంద్రియ ఎరువుల వాడకం ప్రకృతి వ్యవసాయం, పంటల మార్పిడితో నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించవచ్చని తెలిపారు. పంటల మార్పిడి, సేంద్రియ ఎరువుల వాడకంతో భూమిలో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి భూములు సారవంతంగా మారుతాయని తెలిపారు. రైతులు సాంప్రదాయ యూరియా కంటే నానో యూరియా, నానో డీఏపీ వాడితే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటూరునాగారం ఏడీఏ అవినాష్ వర్మ, ఆత్మ డైరెక్టర్లు మన్నెం సునీల్ బాబు, పల్నాటి నాగేశ్వనావు, కొండపర్తి సీతాదేవి, మండల వ్యవసాయ అధికారి నవీన్ తదితరులు పాల్గొన్నారు.


