జిల్లా టాపర్‌గా కృష్ణ
ములుగు/ములుగు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా సత్తా చాటింది. జిల్లాకు చెందిన విద్యార్థులు గతంకంటే అత్యుత్తమ ఫలితాలు సాధించి ఈ ఏడాది రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచారు. జిల్లాలో మొత్తం 3,287 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 3,264 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో 99.30 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 1,697 మంది బాలురకు 1,681 మంది ఉత్తీర్ణత సాధించారు. 1,590 మంది బాలికలకు 1,583 మంది ఉత్తీర్ణత సాధించారు.
మంత్రి సీతక్క హర్షం
టెన్త్ ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలవడంతో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. కష్టపడి చదివి అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకు, వారికి మార్గనిర్ధేశం చేసిన ఉపాధ్యాయులకు, జిల్లా యంత్రాంగానికి మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు. 99.30 శాతం ఉత్తీర్ణత సాధించడం జిల్లాకే గర్వకారణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,731 ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.
గురుకుల విద్యార్థుల ప్రభంజనం
ములుగు మండలంలోని తెలంగాణ గురుకుల పాఠశాల, ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాల దేవగిరిపట్నం, పిఎం శ్రీ మోడల్ పాఠశాల బండారుపల్లి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థి జె.మనోహర్ 571 మార్కులు సాధించారు. సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన హనీశ్రీ 565 మార్కులు సాధించారు. అలాగే దేవగిరిపట్నం మైనార్టీ గురుకుల పాఠశాలలో ఎం.సాత్విక 567 మార్కులు సాధించారు. బండారుపల్లి మోడల్ పాఠశాలకు చెందిన కె.సిరి చందన 563 మార్కులు సాధించారు. జిల్లా కేంద్రంలోని కస్తూ ర్బా గాంధీ బాలికల పాఠశాలలో రేగుల సింధుప్రియ 544 మార్కులు సాధించారు. జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన పవన్ కల్యాణ్ 549, మైనార్టీ గురుకుల పాఠశాలలో 54 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా 100 శాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు 37 మంది విద్యార్థినులు 500పైగా మార్కులు సాధించారు. బండారుపల్లి మోడల్ పాఠశాలలో 95 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 94 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా 17 మంది 500 పైగా మార్కులు సాధించారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 33 మంది పరీక్షలకు హాజరు కాగా 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆరుగురు విద్యార్థులు 500పైగా మార్కులు సాధించారు.
ఏటూరునాగారం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థిని కోరంకున్నత్ కృష్ణ 589 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. అలాగే గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, విద్యార్థుల పట్టుదల విజయానికి దోహదపడ్డాయి. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులే పలు మండలాల్లో టాపర్‌లుగా నిలవడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా టాపర్‌గా నిలిచిన కృష్ణను పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు డీఈఓ సిద్ధార్థరెడ్డి, విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.


