ఏటూరునాగారం: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని అమ్మి రైతులు మద్దతు ధర పొందాలని ఆత్మ చైర్‌పర్సన్ కర్ల అరుణ అన్నారు. మండల పరిధిలోని రామన్నగూడెం, పప్కాపురం, రొయ్యూరు, శివాపూర్, శంకరాజుపల్లి గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను అరుణ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. రైతుల కష్టానికి తగిన మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ధాన్యం విక్రయాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్ల దేవేందర్, చిటమట రఘు, వసంత శ్రీనివాస్, కొండగొర్ల పోశయ్య, సర్పంచ్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
ఆత్మ చైర్‌పర్సన్ కర్ల అరుణ


