● అదనపు కలెక్టర్ మహేందర్ జీ
ములుగు: డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణానికి ప్రతిఒక్కరూ పాటుపడాలని అదనపు కలెక్టర్ మహేందర్‌జీ(రెవెన్యూ) పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అధ్యక్షతన బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల కార్యక్రమాన్ని సోమవారం ఆదనపు కలెక్టర్ హాజరై ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణకు ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాలను జరిపించినా, బాలల హక్కుల పరిరక్షణలో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నేటి సురక్షిత బాల్యమే – రేపటి సురక్షిత తెలంగాణ నిర్మాణానికి పునాది అని పేర్కొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) సంపత్ రావు మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ అనేవి చిన్నారుల ఉన్నతిని నిరోధిస్తాయన్నారు. ఈ సందర్భంగా ములుగు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కలెక్టరేట్ వరకు బాలల భద్రత– డ్రగ్స్ రహిత తెలంగాణ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట మానవహారంగా ఏర్పడి బాలలు, మహిళల హక్కులను కాపాడుతామన్నారు. డ్రగ్స్ రహితంగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దుతామని, సమాజంలోని మూఢ ఆచారాలు, బానిస వ్యవస్థలను రూపుమాపేలా పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్, డీసీపీఓ ఓంకార్, డీఎంసీ రమాదేవి, సీఏ లావణ్య, నరేశ్, కృష్ణవేణి, హరికృష్ణ, సంజీవ తదితరులు పాల్గొన్నారు.


