బ్రహ్మోత్సవాల శోభ | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాల శోభ

Apr 28 2026 7:59 AM | Updated on Apr 28 2026 7:59 AM

హేమాచలక్షేత్రంలోని యాగశాలలోఅంకురార్పణ

ఉత్సవ మూర్తులకు ఉత్సవాంగ స్నపనం

మంగపేట : రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల క్షేత్రంలో లక్ష్మీనర్సింహస్వామి ఆలయ క్షేత్రానికి బ్రహ్మోత్సవాల శోభ సంతరించుకుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ఉప ప్రధానార్చకులు అమరవాది మురళి కృష్ణమాచార్యులు, ముఖ్య అర్చకులు పెరంబదూర్‌ మధన మోహనాచార్యుల బృందం ఆలయ కార్యనిర్వహణ ఇన్‌చార్జ్‌ అధికారి వీరస్వామి పర్యవేక్షణలో యాగశాలలో ఉదయం 6 గంటల నుంచి విశ్వక్షేనపూజా, భగవత్‌పుణ్యాహవచన, పరిషత్‌ప్రార్థన, రుత్విక్‌వరణం, రక్షాబంధన, ఉత్సవ మూర్తులకు స్నపనం(ఉత్సవాంగ స్నపనం), ఆళువార్లకు తిరువంజనం(అభిషేకం), సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పన పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాగ్నికులు కృష్ణయజుర్వేదం పండితులు వరప్రసాధ్‌, శ్రీరంగం వెంకటాచార్యులు, బరధ్వాజాచార్యులు, అమరవాది రామనర్సింహాచార్యులు, మణిదీపాచార్యులు, విరంచి, ఆలయ పూజారులు ముక్కామల రాజశేఖర్‌శర్మ, అనిపెద్ది రాజీవ్‌, కారంపుడి పవన్‌కుమార్‌ ఆచార్యులు, ఏడునూతుల ఈశ్వర్‌చంద్‌, ఆలయ సీనియర్‌ అసిస్టెంట్‌ సీతారాములు, రికార్డు అసిస్టెంట్‌ లక్ష్మినారాయణ, శివరాజు శేషు, సిబ్బంది పాల్గొన్నారు.

జాతర ఏర్పాట్లపై పరిశీలన

బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో ఆలయ ప్రాంగణంలో దేవాదాయశాఖ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకల ఏర్పాట్లు చేసినట్లు ఈఓ వీరస్వామి తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపం నుంచి దైత అమ్మవారి ప్రాంగణం వరకు ప్రధాన దారిలో తడుకలతో ఏర్పాటు చేసిన చలువ పందిళ్లను ఆయన పరిశీలించారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా వ్యాపారాలు జరుపుకోవాలని ప్రధాన దారికి ఇరువైపులా వెలిసిన స్వీట్‌షాపులు, బొమ్మలు, తదితర వ్యాపారులకు సూచించారు. జాతర ప్రారంభం కావడంతో నూతనంగా ఆలయ సమీపంలో వెలి సిన వివిధ రకాల దుకాణాలు, వచ్చి పోయే భక్తులతో గుట్టపై బ్రహ్మోత్సవాల సందడి నెలకొంది.

హేమాచల క్షేత్రానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం

హేమాచల క్షేత్రంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాల(జాతర) సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ గుట్టపైకి బస్‌ సర్వీస్‌ను సోమవారం ప్రారంభించింది. పది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో గుట్టపైకి వచ్చి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది. ఏటూరునాగారం కంట్రోలర్‌ శ్రీనివాస్‌, శంకర్‌ స్థానిక ఎస్సై సూరితో కలిసి బస్‌ సర్వీస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హన్మకొండ నుంచి హేమాచలక్షేత్రానికి వచ్చే భక్తులు నేరుగా మల్లూరుకు చేరుకోవచ్చన్నారు. ప్రస్తుతం 10 బస్సులను ఏటూరునాగారం నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు మల్లూరుగుట్టపైకి షటిల్‌ సర్వీస్‌లు నడుపనున్నామన్నారు. భక్తుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతామన్నారు. ఏటూరునాగారం నుంచి గుట్టపైకి ఫుల్‌ టికెట్‌ రూ.50, ఆఫ్‌ టికెట్‌ రూ.30, మంగపేట, మల్లూరు నుంచి రూ.30 చార్జీ ఉంటుందని వివరించారు. అలాగే మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మోత్సవాల ప్రొటోకాల్‌ అధికారులు జీపీఓ కుందమళ్ల సురేశ్‌, గంపల నర్సయ్య, జబ్బ నగేశ్‌, ఆలయ మాజీ చైర్మన్‌ పూజారి సురేశ్‌, యర్రంగారి సమ్మయ్య, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement