దళారులకు ధాన్యం విక్రయించొద్దు | - | Sakshi
Sakshi News home page

దళారులకు ధాన్యం విక్రయించొద్దు

Apr 28 2026 7:59 AM | Updated on Apr 28 2026 7:59 AM

దళారులకు ధాన్యం విక్రయించొద్దు

ములుగు రూరల్‌: రైతులు దళారులను నమ్మి ధాన్యం విక్రయించవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి అన్నారు. మండల పరిధిలోని సర్వాపూర్‌, పంచోత్కుల పల్లి, అంకన్నగూడెం, కొత్తూరు, ప్రగళ్లపల్లి, కాసిందేవి పేట గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌, పల్లె జయపాల్‌ రెడ్డి, దేవ్‌సింగ్‌, తదితరులు పాల్గొన్నారు.

రైతులకు కూరగాయల విత్తనాలు

ఏటూరునాగారం: కన్నాయిగూడెం మండలంలోని రైతులకు బీటీటీ ఏటూరునాగారం ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ అందజేసి సబ్సిడీపై కూరగాయల విత్తనాలను అందజేసినట్లు ఆత్మ చైర్మన్‌ కర్ల అరుణ తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన జీవన ఎరువు, జీనన పురుగు మందుల తయారీ, వివిధ పంటల వాడకంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చిన కూరగాయల విత్తనాల ప్యాకెట్లను రైతులకు ఇచ్చినట్లు తెలిపారు.

బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు

ములుగు: జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలను ఆ పార్టీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సానికొమ్ము రమేశ్‌రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు మస్రగాని వినయ్‌కుమార్‌, వేములపల్లి భిక్షపతి, పో రిక సోమానాయక్‌, గొర్రె సమ్మయ్య, సురేష్‌, ముంజాల భిక్షపతి పాల్గొన్నారు.

కాళేశ్వరాలయంలో భక్తులు

కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి కావడంతో ఉదయం 11గంటల లోపు భక్తులు అభిషేక పూజలు, అర్చనలు అధికంగా నిర్వహించారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో దర్శనాలతో పాటు కుంకుమార్చన పూజలు చేశారు. శ్రీసరస్వతి అ మ్మవారిని దర్శించుకున్నారు. శ్రీసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కాలసర్ప నివారణ, నవగ్రహాల వద్ద శనిపూజలను భక్తులు నిర్వహించారు. దీంతో భక్తుల సందడి కనిపించింది.

డీజిల్‌ కోసం క్యూ

మంగపేట: వమండల పరిధిలోని కమలాపురం గాయత్రి పెట్రోల్‌ బంక్‌ వద్ద డీజిల్‌ కోసం క్యూ కట్టారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో డీజిల్‌ వాహనం రావడంతో వినియోగదారులు భారీగా తరలివచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మంగపేట, రాజుపేటలోని 5 పెట్రోల్‌ బంకుల్లో ఆదివారం డీజిల్‌ అయిపోయింది. దీంతో కమలాపురంలోని గాయత్రి పెట్రోల్‌ బంకులో మాత్రమే డీజిల్‌ ఉండటంతో డీజిల్‌ కోసం రైతులు, వరికోత మిషన్ల యజమానులు క్యాన్లతో వచ్చి క్యూకట్టారు. ఆదివారం రాత్రి వరకు అక్కడ కూడా అయిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సోమవారం సాయంత్రం కమలాపురం గాయత్రి పెట్రోల్‌ బంక్‌కు డీజిల్‌ ట్యాంకర్‌ వచ్చిందనే సమాచారం తెలియడంతో వివిధ గ్రామాల నుంచి మంది క్యాన్లతో బంకు వద్దకు తరలివచ్చి క్యూ కట్టారు. కొంతమంది పోటీపడడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి సర్ధిచెప్పి క్యూలో ఉంచి వెళ్లిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement