బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్‌

Apr 27 2026 7:54 AM | Updated on Apr 27 2026 7:54 AM

ములుగు: జిల్లా కలెక్టర్‌గా హేమంత్‌ సహదేవరావు ఆదివారం కలెక్టరేట్‌లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏఓ రాజ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

రామప్పలో

విదేశీయుల సందడి

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆదివారం కామెరూన్‌ దేశానికి చెందిన సోనిలీ, ప్రాన్స్‌ దేశానికి ఇవాన్‌ వెబర్‌లు వేర్వేరుగా సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. రామప్ప ఆలయ చరిత్ర గురించి టూరిజం గైడ్‌ గోరంట్ల విజయ్‌ కుమార్‌ వివరించగా వారు ఆసక్తిగా తిలకించారు. అనంతరం రామప్ప సరస్సును సందర్శించి సరస్సులో బోటింగ్‌ చేశారు.

కన్యకాపరమేశ్వరి జయంతి

ములుగు: కలెక్టరేట్‌లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి మాత చిత్రపటానికి జిల్లా అధికారులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. శ్రీ వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించి, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శాంతి, అహింస, ఆత్మగౌరవం కోసం ఆత్మార్పణం చేసిన వాసవిమాత చరిత్ర, కులమతాలకు అతీతంగా పోరాడిన ఆమె ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.

హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

మల్హర్‌(కాటారం): రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతను పెంపొందించేందుకు కాటారం సబ్‌ డివిజన్‌ పరిధిలో పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కమలాపూర్‌ క్రాస్‌ నుంచి కాళేశ్వరం వరకు ఉన్న రహదారిపై, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రజలు ట్రాఫిక్‌ నియమాలను పాటించాలని, అతివేగాన్ని నివారించాలని పోలీసులు సూచిస్తున్నారు.

బ్రహ్మంగారి ఆరాధన

మహోత్సవాలు

రేగొండ: మండలంలోని రంగయ్యపల్లి గ్రామంలో జగద్గురు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 333వ ఆరాధన మహోత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. గోవిందామాంబా సమేత పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి అభిషేకాలు నిర్వహించి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఇటీవల హామీ ఇచ్చినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు శృంగారపు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శృంగారపు భిక్షపతి, విష్ణుమూర్తి, గురుమూర్తి, కాజుబోజు సూర్యప్రకాశ్‌, వేణు, రమేష్‌, దేవేందర్‌, రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement