ములుగు రూరల్: మక్కల కొనుగోళ్లలో అధికారులు, నిర్వాహకుల అలసత్వం సరికాదని అఖిల భారత కిసాన్ ఫెడరేషన్(ఏఐకేఎఫ్) రాష్ట్ర కోశాధికారి గుండబోయిన చంద్రయ్య అన్నారు. ఈ మేరకు మల్లంపల్లి మండలకేంద్రంలో ప్రభుత్వ మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం సందర్శించి మాట్లాడారు. మల్లంపల్లి మండలకేంద్రంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 8వ తేదీన ఏర్పాటు చేసినా ఇప్పటి వరకు కొనుగోళ్లు చేయకపోవడం దారుణమన్నారు. రైతులు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 2,400కు పంట అమ్ముకోవాల్సిన రైతులు దళారులకు రూ.1800లకు అమ్ముకుంటూ మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లంపల్లి మండల పరిధిలో సుమారు 1100 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని అందుకు అనుగుణంగా 80 వేల గన్ని సంచులు అవసరమని తెలిపారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి, ప్రవీణ్, పోశాలు, నాగేశ్వర్‌రావు, ఐలయ్య, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
ఏఐకేఎఫ్ రాష్ట్ర కోశాధికారి చంద్రయ్య


