ఆటపాటలతో చదువు నేర్పడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఆటపాటలతో చదువు నేర్పడమే లక్ష్యం

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

కన్నాయిగూడెం: అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలకు ఆటపాటలతో చదువు నేర్పడమే లక్ష్యమని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అన్నారు. మండల కేంద్రంలోని బుట్టాయిగూడెం, లక్ష్మిపురం, దేవాదుల, గూర్రేవుల, గ్రామాల్లోని వివిధ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎర్లీ, చైల్డ్‌, కేర్‌, ఎడ్యూకేషన్‌(ఈసీసీఈ) ప్రోగ్రామ్‌ను శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా 3 నుంచి ఆరేళ్ల పిల్లలకు వివిధ రకాల వస్తువులు, బొమ్మలతో ఆటలు, పాటలతో చదువు నేర్పిస్తున్నట్లు తెలిపారు. గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే పోషక పదార్థాలు, ఆహారాన్ని స్వీకరించాలని తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా విద్యార్థులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువు నేర్పిస్తున్నట్లు వివరించారు. పిల్లల మేధాశక్తి, సామాజిక అభివృద్ధి, సృజనాత్మకతను పెంపొందించే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూర్రేవుల సర్పంచ్‌ అంబాల సౌజన్య, సెక్టార్‌ సూపర్‌ వైజర్‌ పుష్పవతి, అంగన్‌వాడీలు రజిత, అనిత, తదితరులు పాల్గొన్నారు.

ప్రణాళికతో చదివితేనే భవిష్యత్‌

ఎస్‌ఎస్‌తాడ్వాయి: విద్యార్థులు ప్రణాళికతో చదివితేనే భవిష్యత్‌ బాగుంటుందని, అంగన్‌వాడీ కేంద్రంలో చదువుకున్న చిన్నారుల భవిష్యత్‌ విద్యా ప్రయాణం సాఫీగా సాగాలని జిల్లా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి అన్నారు. ప్రథమ్‌ ఎడ్యూకేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో కామారం(పీటీ) గ్రామ పంచాయతీలోని ఒకటవ అంగన్‌వాడీ కేంద్రంలో శనివారం నిర్వహించిన గ్రాడ్యూయేషన్‌ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని తదుపరి విద్య దశలోకి చిన్నారులు అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే స్నాతకోత్సవమని తెలిపారు. అనంతరం ప్రాథమిక విద్యను విజయవంతంగా పూర్తి చేసి ఐదేళ్లు నిండిన చిన్నారులను ఘనంగా సన్మానించి ప్రశంస ప్రతాలు, బహుమతులను కల్యాణి అందజేశారు.

జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత

Advertisement
 
Advertisement
Advertisement