జిల్లాలో 19 సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం
ములుగు: లక్షలు వెచ్చించి నిర్మించిన సామూహిక మరుగుదొడ్లు వినియోగంలో లేకపోవడంతో ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మండలకేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లో ప్రజల అవసరాలు తీర్చేందుకు స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా చేపట్టిన సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు జిల్లాలో ఇప్పటి వరకు కొన్నిచోట్ల నిర్మాణం పూర్తి కాలేదు. మొత్తం 19 మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.57 లక్షలు మంజూరు చేయగా 11 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయగా ఇంకా 8 మరుగుదొడ్ల నిర్మాణాలు పురోగతిలోనే ఉన్నాయి. పూర్తయిన మరుగుదొడ్లను కూడా కొన్నిచోట్ల వినియోగంలోకి తేకపోవడంతో అలంకారప్రాయంగా మిగిలాయి
ఒక్కో నిర్మాణానికి రూ.3 లక్షలు
ప్రతీ మండల కేంద్రంతో పాటు మేజర్ గ్రామాల్లో సామూహిక మరుగుదొడ్డి నిర్మించడానికి ఒక్కో సముదాయానికి రూ.3 లక్షలు కేటాయించారు. గ్రామ పంచాయతీ అధికారులు స్థలం సమకూరిస్తే స్వచ్ఛభారత్ మిషన్ నిధులతో నిర్మాణాలు చేపట్టారు. జిల్లాలోని పది మండలాల్లో పంచాయతీ అధికారులు కేటాయించిన స్థలాల్లోనే మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. రెండేళ్ల క్రితం జిల్లాలోని ములుగుకు 4, మంగపేట 3, వాజేడు 3, వెంకటాపురం(ఎం) మండలానికి 2, వెంకటాపురం(కె) మండలానికి 2, ఏటూరునాగారం, గోవిందరావుపేట, కన్నాయిగూడెం, మల్లంపల్లి, తాడ్వాయి మండలాలకు ఒక్కొక్కటి చొప్పున 19 నిర్మాణాలకు రూ.57 లక్షలు కేటాయించారు.
నీటి వసతి లేక నిరుపయోగం
జిల్లాలోని వెంకటాపురం(ఎం), వాజేడు, మంగపేట మండలాల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ నీటివసతి లేకపోవడంతో మరుగుదొడ్లు వినియోగంలోకి రాక అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల నిర్వహణ భారంగా ఉందనె నెపంతో పంచాయతీ అధికారులు సామూహిక మరుగుదొడ్లకు తాళాలు వేశారు. లక్షలు వెచ్చించి నిర్మించిన సామూహిక మరుగుదొడ్లను వినియోగంలోకి తేవాలని ప్రయాణికులు, స్థానికులు అధికారులను కోరుతున్నారు.
లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలి. గ్రామపంచాయతీల్లో, బస్టాండ్ కూడలిలో ప్రయాణికుల, ప్రజల అవసరాలు తీర్చేందుకు నిర్మించిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. కొన్నిచోట్ల తాళాలతో దర్శనమిస్తుండగా, మరికొన్ని చోట్ల నిర్వహణ సరిగా లేక అసంపూర్తిగా మారాయి. అధికారులు తక్షణమే స్పందించి మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలి.
– మంద మహేందర్, వెంకటాపురం(ఎం)
ఒక్కో నిర్మాణానికి రూ.3లక్షలు
వినియోగంలోకి రాక ప్రయాణికుల ఇబ్బందులు


