ములుగు రూరల్: మండలపరిధిలోని రాయినిగూడెంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లో భాగంగా న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ రైతు సాగు చట్టాలు, కౌలుదారు చట్టాల గురించి వివరించారు. భూములు కొనేటప్పుడు సదరు భూమిపై ఏమైన కేసులు ఉన్నయా అని జాగ్రత్త చూసుకోవాలన్నారు. ఉచిత న్యాయ సలహా ఎలా పొందాలో వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటి చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ బానోత్ స్వామి దాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలుగు చంద్రయ్య, పారా లీగల్ వలంటీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
నైపుణ్య శిక్షణతో
ఉపాధి అవకాశాలు
గోవిందరావుపేట: నైపుణ్యం కలిగిన యువతకు ప్రభుత్వం విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని డీఆర్‌డీఓ చంద్రశేఖర్ అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా యువతకు నైపుణ్యాభ/వృద్ధి శిక్షణ కార్యక్రమం ఎంపీడీఓ వరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్యఅతిథిగా డీఆర్‌డీఓ హాజరై మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. మునగ పంట, పుట్టగొడుగుల పెంపకం, చేపల పెంపకం వంటి రంగాల్లో ఉన్న లాభాలపై అవగాహన కల్పించారు. యువతకు 21 రకాల నైపుణ్య శిక్షణలు అందిస్తున్నామని, శిక్షణ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం సీతారాం, మహిళా సంఘాల వీఓలు, సీసీలు, సభ్యులు పాల్గొన్నారు.
ముమ్మరంగా విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు
మంగపేట: మండలంలోని కమలాపురంలో 133 కేవీ సబ్ స్టేషన్ పరిధిలో ఈనెల 22న గాలివానకు ధ్వంసమైన విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు ములుగు డీఈ పులసం నాగేశ్వర్‌రావు, ఏటూరునాగారం డీఈ పురుశోత్తం పర్యవేక్షణలో ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనెల 22న సాయంత్రం గాలివానకు విద్యుత్ లైన్లు ధ్వంసం కావడంతో సరఫరా పూర్తిగా నిలిచిపోయిన విషయం విధితమే. అదేరోజు అర్ధరాత్రి వరకు గ్రామాలకు కరెంటు సరఫరాను పునరుద్ధరించిన అధికారులు రెండు రోజుల నుంచి పూర్తి స్థాయి మరమ్మతు పనులు కొనసాగిస్తున్నారు. ధ్వంసమైన స్తంభాల స్థానంలో నూతన స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. గాలివాన బీభత్సానికి సుమారు రూ.30 లక్షల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు ఇన్‌చార్జ్ ఏఈ కృష్ణారావు తెలిపారు. మరో మూడు రోజుల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామన్నారు.
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈనెల 24, 25 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీబీఏ, బీఎస్సీ వివిధ సెమిస్టర్ల పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శుక్రవారం తెలిపారు. ఆర్టీసీ బస్సుల బంద్ నేపథ్యంలో ఈరెండు రోజుల పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. ఈనెల 27 నుంచి టైంటేబుల్ ప్రకారం యథావిధిగా ఆయా పరీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈనెల 24, 25న వాయిదా పడిన పరీక్షల తేదీలు తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.
రిజిస్ట్రార్‌కు ఏబీవీపీ వినతి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఏబీవీపీ కేయూ కార్యదర్శి మేకల జ్ఞానేశ్వర్, బాధ్యులు మెరుగు సాయి, అఖిల్, రజనీకాంత్, ప్రణయ్ శుక్రవారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంకు వినతిపత్రం అందించారు.


