గాలివానతో తీవ్రనష్టం | - | Sakshi
Sakshi News home page

గాలివానతో తీవ్రనష్టం

Apr 24 2026 6:38 AM | Updated on Apr 24 2026 6:38 AM

350 ఎకరాల్లో నేలవాలిన వరి

ఏటూరునాగారం: జిల్లాలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. రైతులు, ప్రజలను అతలాకుతలం చేసింది. బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతాల్లో ప్రారంభమైన గాలిదుమారం జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం(కె), వాజేడు, కన్నాయిగూడెం ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఉన్నట్టుండి గాలి దుమారం భారీగా రావడంతో పలు చెట్లు నేలమట్టమయ్యాయి. దీంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు 150 విద్యుత్‌ స్తంభాలపై పడడంతో తీగలు తెగిపోయాయి. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, ఇన్సులేటర్లు మొత్తం విరిగిపోయాయి. రాత్రి 6 గంటలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అర్ధరాత్రి 2 గంటలకు విద్యుత్‌ సరఫరాను మూడు మండలాల్లో పునరుద్ధరించారు. రాత్రి సమయంలో విద్యుత్‌ శాఖ అధికారులు ఎంతో కృషి చేసి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా డిష్‌ కేబుల్‌ లైన్లు, నెట్‌ లైన్లు మొత్తం తెగిపోయి ఇంటర్నెట్‌ సేవలు, టీవీ ప్రసారాలు ఆగిపోయాయని స్కైవిజన్‌ మేనేజర్‌ పూర్ణ తెలిపారు.

ఎగిరిపోయిన రేకులు, దెబ్బతిన్న ఇళ్లు

ఏటూరునాగారం మండల పరిధిలోని రామన్నగూడెం, రాంనగర్‌ గ్రామాల్లో ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కోయగూడ, ఎల్లాపురం, రాంనగర్‌ పంచాయతీల్లోని లంబాడితండాకు చెందిన గార లక్ష్మి ఇల్లు రేకులు మొత్తం ఎగిరిపోయాయి. దీంతో రూ. 1.50లక్షల నష్టం వాటిల్లింది. రేకులు షెడ్డు నిర్మించి నెల రోజులు మాత్రమే అవుతుందని బాధితురాలు కన్నీరు మున్నీరుగా విలపించారు. రాంనగర్‌లో 6, లంబాడీతండాలో 18, పప్కాపురంలో 4 ఇళ్లకు చెందిన రేకులు దెబ్బతిని తీవ్రంగా ప్రజలు నష్టపోయారు.

దెబ్బతిన్న వరిపైరు

ఏటూరునాగారంలోని 6వ వార్డుకు చెందిన జనగాం మహేశ్‌ వరిపొలం నేలబారింది. గోగుపల్లి, శివాపురం, ఏటూరునాగారంలోని రామన్నగూడెం, రాంనగర్‌, చిన్నబోయినపల్లి, షాపెల్లితో పాటు పలు ప్రాంతాల్లో 350 ఎకరాల్లో వరి పంట నేలబారింది. పొలాలు నేలబారి వర్షానికి ధాన్యం రాలిపోయి తీవ్రంగా నష్టం వాటిల్లింది. వరికంకులను పైకి లేపేందుకు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. వరి కంకుల నుంచి ధాన్యం రాలిపోవడంతో దిగుబడి తగ్గే అవకాశాలున్నాయని రైతులు వాపోతున్నారు. అలాగే అనేక ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. వరిధాన్యం చేతికొచ్చేలోపు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో కల్లాలోని మిర్చి తడిసింది. రంగు మారకుండా ఉండేందుకు రైతులు మిర్చిని ఆరబోస్తున్నారు.

150 వరకు విరిగిన విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు

కల్లాల్లో తడిసిన మిర్చి పంట

ఆదుకోవాలని రైతుల వేడుకోలు

Advertisement
 
Advertisement
Advertisement