మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

Apr 24 2026 6:38 AM | Updated on Apr 24 2026 6:38 AM

జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత

ఏటూరునాగారం: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ ఉద్యమించాలని జిల్లా సంక్షేమ అధికారి ఈపీ ప్రేమలత అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల, జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు బాలల పరిరక్షణ విభాగము ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిషేధం, బాలల హక్కుల పరిరక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ప్రేమలత హాజరై మాట్లాడారు. ములుగును డ్రగ్స్‌ రహిత జిల్లాగా మార్చేందుకు మంత్రి సీతక్క సూచనల మేరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్‌ వాడకం మంచిది కాదని అవి ప్రాణాంతకమైనవని వివరించారు. మత్తుకు బానిసలుగా మారిన వారు మృగంలా వ్యవహరిస్తారని తెలిపారు. అలాగే టెక్నాలజీని సరైన దిశలో వినియోగించుకుంటే జీవితాలు బాగుంటాయని వివరించారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు సెల్‌ఫోన్‌కు బానిసలుగా మారకుండా కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. వేసవికాలం సెలవుల్లో బయట తిరగవద్దన్నారు. అదేవిధంగా పోషణ్‌ పక్వాడాలో భాగంగా పోషకాహార ప్రాధాన్యత గురించి వివరించారు. ఆపదలో ఉన్న వారు చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098, 112 టోల్‌ ఫ్రీ నంబర్లకు కాల్‌ చేసి సాయం పొందాలన్నారు. అనంతరం డ్రగ్స్‌ నిర్మూలనకు కట్టుబడి ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి ప్లకార్డులను ప్రదర్శించిన అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలల పరిరక్షణ అధికారి హరికృష్ణ, హెడ్మాస్టర్‌ సాంబశివరావు, బానోతు రాజునాయక్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ పుష్పావతి, జెండర్‌ స్పెషలిస్ట్‌ స్వప్న పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement