● డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
ములుగురూరల్: మీజిల్స్ రూబెల్లా వ్యాధి నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధికారులతో గురువారం హెల్త్ ప్రొవైడర్స్, సూపర్‌వైజర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలను ఇవ్వాలన్నారు. మీజిల్స్ రూబెల్లా నిర్మూలనకు క్యాచ్ అప్ ప్రత్యేక కార్యక్రమాలు మూడు దశల్లో ఉంటాయని వివరించారు. అశ వర్కర్లు ఇంటింటికి వెళ్లి పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోపు చిన్నారుల జాబితాను తయారు చేసుకోవాలని సూచించారు. వారిలో వ్యాధి నిరోధక టీకాలు తీసుకోని వారి వివరాల జాబితాను తయారు చేసి పీహెచ్‌సీల వారీగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఈ మేరకు ఈ నెల 27 నుంచి మే 4వ తేదీ వరకు మొదటి దశ, జూలై 22 నుంచి 27 వరకు రెండోదశ, అక్టోబర్ 12 నుంచి 19 వరకు మూడు దశల్లో నియంత్రణ టీకాలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాతాశిశు సంరక్షణ అధికారి శ్రీకాంత్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల నియంత్రణ పోగ్రాం అధికారి నాగ అన్వేష్, మీడియా అధికారి సంపత్ తదితరులు పాల్గొన్నారు.


