గాలివాన బీభత్సం | - | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సం

Apr 23 2026 8:48 AM | Updated on Apr 23 2026 8:48 AM

ఏటూరునాగారం/వెంకటాపురం(కె)/మంగపేట/ఎస్‌ఎస్‌ తాడ్వాయి: ఏజెన్సీలోని ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం(ఎం), కన్నాయిగూడెం, ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలాల్లో బుధవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. బుధవారం సాయంత్రం ఈదురు గాలులు.. రాళ్ల వానతో పలు ఇళ్లపై రేకులు సైతం ఎగిరిపోయాయి. ఏటూరునాగారం మండల కేంద్రంలోని 2వ వార్డులో గుండారపు రాజు ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. కమలాపురం, చిన్నబోయినపల్లి అటవీ ప్రాంతాల్లో విద్యుత్‌స్తంభాలు నెలకొరిగాయి. చెట్ల కొమ్మలు సైతం రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. విద్యుత్‌శాఖ అధికారులు విద్యుత్‌ స్తంభాల వద్దకు చేరుకొని మరమ్మతులు చేసే పనిలో నిమగ్నమయ్యారు. రాళ్ల వర్షం కురవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంకటాపురం(ఎం), కన్నాయిగూడెం మండలాల్లో ఆరుగాలం కష్టపడిన పంటను రక్షించుకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. కల్లాలోని మిర్చి, వరి పంటను కాపాడుకునేందుకు టార్ఫాలిన్‌ కవర్లతో పరుగులు తీశారు. వర్షం నీటితో పంట తడవకుండా కాల్వలు తీసి నీటిని బయటకు పంపారు. వర్షం కురిసిన అనంతరం టార్ఫాలిన్లపై నిలిచిన నీటిని తొలగించారు.

మూడు గంటల పాటు ట్రాఫిక్‌ జామ్‌

మంగపేట మండలంలోని కమలాపురం శివారులోని హనుమాన్‌ దేవాలయం ప్రాంగణంలోని భారీ రావి చెట్టు విరిగి విద్యుత్‌ లైన్‌పై పడింది. దీంతో కమలాపురం 133 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి కమలాపురం టౌన్‌, ఏటూరునారం, తాడ్వాయి మండలం కాటాపురానికి విద్యుత్‌ సరఫరా అయ్యే లైన్‌పై భారీ వృక్షం పడటంతో రోడ్డు వెంట ఉన్న సుమారు 10 వరకు విద్యుత్‌ స్తంభాలు విరిగి పడ్డాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఒక పక్క విద్యుత్‌ లైన్‌, మరోపక్క భారీ వృక్షం ఏటూరునాగారం –బూర్గంపాడు ప్రధాన రోడ్డుపై పడటంతో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. విషయం తెలిసిన వెంటనే ఎస్సై టీవీఆర్‌ సూరి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ, విద్యుత్‌ సిబ్బంది సహకారంతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలను తొలగించి ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు.

ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు

పంటలను కాపాడుకునేందుకు

రైతులకు తప్పని తిప్పలు

విరిగి పడిన విద్యుత్‌ స్తంభాలు

Advertisement
 
Advertisement
Advertisement