వీధుల్లో స్వైర విహారం.. ప్రజలపై నిత్యం దాడులు
ఏటూరునాగారం: కుక్కలతో జనం బెంబేలు ఎత్తిపోతున్నారు. ఇళ్లు విడిచి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఏ వీధి చూసినా శునకాలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజలను వెంబడించి మరి కరుస్తున్నాయి. మూగ జీవాలను వేటాడి చంపుతూ పీక్కుతింటున్న పరిస్థితి నెలకొంది. ఎండాకాలం కావడంతో ఇరిటేషన్ పెరిగి ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. రోజూ కనీసం పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. కుక్కలను చూస్తేనే జనం బాబోయ్ కుక్కలంటూ పరుగులు పెడుతున్న పరిస్థితి నెలకొంది. కుక్కల బెడద నుంచి కాపాడాలని ప్రజలు అధికారులకు విన్నవించినా తగిన చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. కుక్కలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై బుధవారం ‘సాక్షి’ చేపట్టిన గ్రౌండ్ రిపోర్టులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
10 మండలాలు.. 632 కేసులు
జిల్లాలోని 10 మండలాల పరిధిలో 7,306 కుక్కలు ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన పశుగణనలో అధికారులు గుర్తించినట్లు తెలిపారు. అలాగే ఈ ఏడాదిలో నమోదైన కుక్కకాటు కేసులు 632గా నమోదు అయ్యాయి. అయితే గ్రామాల్లోని కుక్కలకు గ్రామ పంచాయతీ సిబ్బంది పశు ఆస్పత్రి వద్దకు తీసుకెళ్లి వ్యాక్సినేషన్ చేయించాల్సి ఉంది. కానీ జీపీ సిబ్బంది కుక్కలను తీసుకెళ్లడం లేదనే విమర్శలు వస్తున్నాయి. వ్యాక్సినేషన్ లేకపోవడంతో గజ్జి, జుట్టు ఊడిపోవడంతో పాటు శరీరంపై మచ్చలతో పాటు వివిధ రకాల రోగాల బారిన పడుతున్నాయి.
కుక్కలకు వ్యాక్సిన్లు నిల్
వీధి కుక్కలకు యాంటి రేబీస్ వ్యాక్సిన్లు పశు ఆస్పత్రుల్లో నిల్వ ఉన్నప్పటికీ వీధుల్లో తిరిగే వాటికి వేయడం లేదు. అంతేకాకుండా జిల్లాలో ఎక్కడ కూడా కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగడం లేదు. నిర్మూలనకు చర్యలు చేపట్టడం లేదు. ములుగు, ఏటూరునాగారం సామాజిక, ఏరియా ఆస్పత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుక్కకాటు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే జీవవ్యర్థాలు, వృథా ఆహారం ఎక్కువగా లభించే ప్రాంతాల్లో కుక్కల బెడద అధికంగా ఉంది. ఫంక్షన్ హాల్స్, మటన్, చికెన్ షాపుల వద్ద వ్యర్థాలను తినేందుకు అలవాటు పడి దాడులకు పాల్పడుతున్నాయి.
ఆస్పత్రుల పాలవుతున్న జనం
మూగజీవాలను వేటాడి చంపుతున్న శునకాలు
ఏడాదిలో 632 కుక్కకాటు
కేసుల నమోదు
కొన్ని సంఘటనలు ఇలా..
కన్నాయిగూడెం మండల పరిధిలో బుధవారం పిచ్చికుక్క దాడి ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. అందులో ఒకరు కావిరి కృష్ణమూర్తి, అసరెల్లి గగురక్క, మరోకరు ఉన్నారు. అలాగే ఏప్రిల్ నెలలో కన్నాయిగూడెంలో 68 మంది గాయపడగా ఏటూరునాగారంలో 98 కుక్కకాటు కేసులు నమోదు కావడం గమనార్హం. మంగపేట మండల పరిధిలో ఏడాది కాలంలో మంగపేటలో 135, బ్రాహ్మణపల్లిలో 68, చుంచుపల్లిలో 28 కేసులు నమోదు అయ్యాయి. ములుగు మండలంలో జనవరిలో 16, ఫిబ్రవరిలో 16, మార్చిలో 7, ఏప్రిల్‌లో ఒక కేసు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. వాజేడు మండలంలో 174 కుక్కకాటు కేసులు నమోదు కాగా వెంకటాపురం(ఎం)లో ఏప్రిల్ నెలలో 26 కేసులు నమోదు అయ్యాయి.


