ములుగు: జిల్లా కేంద్రంలోని కోర్టు ఎదుట డివైడర్ నిర్మాణానికి అదనపు కలెక్టర్ మహేందర్‌జీకి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. కోర్టు ప్రాంతంలో యూటర్న్ డివైడర్ లేకపోవడంతో రాంగ్ రూటులో వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారనే నెపంతో సంఘటన స్థలాన్ని ఆర్‌అండ్‌బీ, నేషనల్ హైవే, పోలీస్ శాఖ అధికారులతో బుధవారం సందర్శించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా కోర్టు ఎదుట గల హైవే రోడ్డుకు యూటర్న్ డివైడర్ ఏర్పాటు చేయాలని అధికారులకు ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం శోభాయమానంగా జరిగింది. అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించి అమ్మవారిని పూలమాలలతో అలంకరించారు. ఉదయం అమ్మవారి ఉత్సవమూర్తిని సింహవాహనంపై, సాయంత్రం గజవాహనంపై ఊరేగించారు. రాత్రి ఆలయ అవరణలో పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈఓ రామల సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు.


