ములుగు రూరల్: ప్రజావాణి–గిరివాణి(గిరిజన దర్బార్)లో వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి–గిరివాణిలో బాధితుల నుంచి కలెక్టర్ టీఎస్.దివాకర అర్జీలను స్వీకరించారు. వాటిని పరిశీలించి ఆయా శాఖల అధికారులకు ఫార్వర్డ్ చేశారు. వినతులను సంబంధిత అధికారులు పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలని ఆదేశించారు.
96 దరఖాస్తులు స్వీకరణ
జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి, గిరివాణి కార్యక్రమంలో 96 అర్జీలను బాధితుల నుంచి స్వీకరించారు. ఇందులో భూ సమస్యలకు సంబంధించి 32, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుకు సంబంధించి 9వినతులను బాధితులు అందజేశారు. అలాగే పింఛన్లు ఇవ్వాలని కోరుతూ 32మంది బాధితులు వినతులు అందించగా ఉపాధి కల్పించాలని కోరుతూ ఒకరు వినతి అందించారు. అలాగే ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 22 మంది బాధితులు కలెక్టర్‌కు వినతులు అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, ఆర్డీఓ వెంకటేశ్‌లు పాల్గొన్నారు.
రెండేళ్ల క్రితం భర్త మరణించాడు. దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాను. పిల్లలను పోషణతో పాటు కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. ప్రభుత్వం స్పందించి పింఛన్ వచ్చేలా చూడాలి.
– గన్నెర్ల శారద, ములుగు
మాది నిరుపేద కుటుంబం. ఇందిరమ్మ ఇళ్ల లీస్టులో ఎల్–1 కింద మా పేరు ఉంది. కుటుంబ సభ్యులందరం చిన్న ఇంట్లో నివసించడం ఇబ్బందిగా ఉంది. అధికారులు స్పందించి ఇల్లు కేటాయించి ఆదుకోవాలి.
– లావుడ్య బాలకుమారి, రంగారావుపల్లి, ములుగు


