
దసరాకు సర్వం సిద్ధం
ములుగు: జిల్లా వ్యాప్తంగా నేడు (గురువారం) విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించుకోనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దసరా పండుగ సందర్భంగా ఉదయాన్నే పలు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారు. జిల్లా కేంద్రంలో ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో రావణాసుర వధ దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వహకులు తెలిపారు. అదే విధంగా ఆయుధపూజ నిర్వహించుకోనున్నారు. రైతులు వ్యవసాయ పనిముట్లు, వాహనదారులు తమ వాహనాలకు, పోలీసులు ఆయుధాలకు ఇలా ఎవరికివారు తమ వృత్తుల్లో ఉపయోగించే పనిముట్లు, ఆయుధాలకు పూజలు చేయనున్నారు. అనంతరం విజయదశమి రోజు శమీ దర్శనం కోసం జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు చేశారు.
పాల పిట్ట దర్శనం ప్రత్యేకం
దసరా పండుగ రోజు సాయంత్రం పాల పిట్టను చూస్తే శుభం కలుగుతుందనే నమ్మకం ఉన్నది. ఈ రోజున మూడు రకాల పక్షులను చూడడం ఆనవాయితీ. పాల పిట్టను చూస్తే పాపాలు, కర్రె పిట్టను చూస్తే కష్టాలు, గరత్మంతుడు అంటే గద్దను చూస్తే గండాలు తొలుగుతాయని ప్రజల నమ్మకం. ఇందుకోసం శమీపూజ అనంతరం కిలో మీటర్ల దూరం అటవీ ప్రాంతంలోకి పోయి పాలపిట్టను దర్శించుకుంటారు.
ములుగులో ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో..
జిల్లాకేంద్రంలో ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో రావణాసుర వధ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. రావణాసుర వధ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్, ఎస్పీ శబరీశ్‌లు, వక్త భగవధ్గీత ప్రచారకులు అభయ హిందూ ఫౌండేషన్ శ్రీ రాధమనోహర్‌దాస్ స్వామిజీ హాజరు కానున్నట్లు నిర్వహకులు వెల్లడించారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ములుగులో ధర్మజాగరణ సమితి
ఆధ్వర్యంలో రావణాసుర వధ