
కాంగ్రెస్ పాలనలోనే సొంతింటి కల సాకారం
ములుగు రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే పేదల సొంతింటి కల సాకారం అవుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర –శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల పరిధిలోని మదనపల్లిలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి మంత్రి బుధవారం హాజరై మాట్లాడారు. జిల్లాలో 5వేల ఇళ్లను మంజూరు చేశామన్నారు. ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి పనిచేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని గిరిజనభవన్‌లో నిర్వహించిన కృతజ్ఞత సన్మానసభకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ ఉపకులాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల్లో నియోజకవర్గంలో 100ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. జిల్లాకేంద్రంలో ఎస్సీ ఉపకులాలకు కమ్యూనిటీ భవన నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిందని తెలిపారు. అనంతరం మంత్రి సీతక్కను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, గడ్డం వెంకటేశ్వర్లు, కుమారస్వామి, రమేష్, గోపాల్ వెంకటరాంనర్సయ్య, రాజమౌళి, రమేష్ పాల్గొన్నారు.
రూ.4లక్షల డిపాజిట్ పత్రాలు అందజేత
ములుగు మున్సిపాలిటీ పరిధిలో మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు మైదం మహేష్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు బాధిత కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించి బాధితుడి పిల్లల పేరున రూ.4లక్షల డిపాజిట్ చేసిన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహేష్ మృతికి కారణమైన ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు వారి స్వార్ధ రాజకీయాల కోసం మహేష్ మరణాన్ని వాడుకుంటున్నారని వివరించారు. అనంతరం మదనపల్లి గ్రామానికి చెందిన దూడపాక మహేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
మంత్రి సీతక్క