
పర్యాటకులకు ఇబ్బంది కలగొద్దు●
వాజేడు : బొగత జలపాతం వద్ద పర్యాటకులకు ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని వెంకటాపురం(కె) ఎఫ్‌డీఓ ద్వాలియా సిబ్బందిని సూచించారు. శనివారం మండల పరిధిలోని చెరుకూరు వద్ద ప్లాంటేషన్‌లో చేపట్టిన పనులను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం బొగత జలపాతానికి వచ్చిన ద్వాలియా అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. జలపాతానికి వచ్చే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలన్నారు. దుసపాటి లొద్ది, మాసన్ లొద్ది జలపాతాలకు పర్యాటకులను వెళ్లకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట ఎఫ్‌ఎస్‌ఓ నారాయణ, సిబ్బంది ఉన్నారు.
పోలీస్ ఔట్‌పోస్ట్ సేవలు ప్రారంభం
ములుగు రూరల్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పోలీస్ ఔట్ పోస్టు సేవలను మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌లాల్, సీఐ సురేష్‌తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పోలీస్ ఔట్ పోస్టులో 24గంటలు పోలీసులు విధుల్లో ఉంటారని ప్రజలు వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్‌రావు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
సాగు భూములు తీసుకోవద్దు
వెంకటాపురం(కె) : పాలెం ప్రాజెక్టు కాల్వ పనుల్లో భాగంగా ఆదివాసీలు సాగు చేస్తున్న భూములను ప్రభుత్వం తీసుకోవాలని చూస్తే సహించేది లేదని ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు కోర్సా నర్సింహామూర్తి పేర్కొన్నారు. తమ భూములు తీసుకోవద్దని తహసీల్దార్ వేణుగోపాల్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలెం ప్రాజెక్టు నుంచి కాల్వ నిర్మాణానికి ముకునూరు పాలెం, కమ్మరిగూడెంలో భూములు తీసుకోవడానికి ఆదివాసీ రైతులు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రైతులకు తెలియకుండా అధికారులు సర్వే చేయడం సరికాదన్నారు. ఆదివాసీ చట్టాలను విస్మరించి సాగు భూములను ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు. నాయకులు కుంజా మహేష్, రాము, సమ్మయ్య, లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.
రాజీవ్ యువవికాసం
అమలు చేయాలి
ములుగు రూరల్ : రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తామని దరఖాస్తులు స్వీకరించి అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించి పథకం నిలిపివేయడం నిరుద్యోగ యువత అసహనానికి గురవుతున్నారని వెల్లడించారు. రాజీవ్ యువ వికాస పథకాన్ని అమలు చేసి యువతకు స్వయం ఉపాధి కల్పించాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
రేపు అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
ములుగు రూరల్ : జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఈ నెల 30న(సోమవారం) నిర్వహిస్తున్నామని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటేశ్వర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 10, 12, 14 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులను ఏ,బీ,సీ విభాగాలుగా బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తామని వివరించారు. పోటీల్లో 60 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, కిడ్స్ జావిలిన్ త్రో అంశాల్లో ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు, పోటీల్లో పాల్గొనే బాలబాలికలు తెలంగాణ గురుకుల బాలుర పాఠశాలలో హాజరు కావాలని తెలిపారు. పాఠశాల పీఈటీ రాజ్‌కుమార్‌కు జనన ధ్రువీకరణ పత్రం అందించి పోటీల్లో పాల్గొనాలని సూచించారు.

పర్యాటకులకు ఇబ్బంది కలగొద్దు●