
సమస్యలు పరిష్కరించడంలో విఫలం
● మాజీ ఎంపీ మిడియం బాబురావు
ఏటూరునాగారం : వలస ఆదివాసుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ మిడియం బాబురావు అన్నారు. ఆదివాసీ హక్కులపై శనివారం మండల కేంద్రంలోని గిరిజన భవన్‌లో గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించగా బాబురావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆదివాసీల గూడేలకు కనీస వసతులు కల్పించకుండా, వారిని వలసవాదులుగా ముద్రించి, కుల ధ్రువీకరణ పత్రాలు, కనీస వసతులు కల్పించకుండా ఆదివాసీ హక్కులను కాలరాస్తోందన్నారు. వారిని అడవి నుంచి పంపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఆదివాసీలు దేశంలో ఎక్కడైనా జీవించే హక్కు ఉందని, వారికి అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని సూచించారు. అటవీ సంరక్షణ, జంతు, జీవజాతుల రక్షణ పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి పంపేందుకు జీఓ 49 తీసుకువచ్చి 339 ఆదివాసీల గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని మండిపడ్డారు. జీఓ 49ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు జెజ్జరీ దామోదర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దుగ్గి చిరంజీవి, గొంది రాజేష్, జిల్లా కమిటీ సభ్యులు అలెం అశోక్, కుర్సం శాంతకుమారి, కోరం చిరంజీవి, తోలెం కృష్ణయ్య, కుర్సం చిరంజీవి, పూనెం నగేష్, ఊకే ప్రభాకర్, కొట్టెం కృష్ణారావు పాల్గొన్నారు.