
‘బీసీ కుల జనగణన చేపట్టాలి’
ములుగు రూరల్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తక్షణమే బీసీ కుల జనగణన చేపట్టాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు తాటిపాముల వెంకట్రావ్ అన్నారు. జిల్లా కేంద్రంలో బీసీ సాధన సమితి మహాసభలను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్ వారు చేసిన జన కులగణన తప్పా స్వాతంత్య్రం వచ్చిన అనంతరం ఏ ప్రభుత్వం బీసీ కులజన గణన చేపట్టలేదన్నారు. నూటికి 60 శాతంగా ఉన్న బీసీలకు ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్ అమలు చేయటం దారుణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన బిల్లును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల రాజు, బండి నర్సయ్య, జక్కుల ఐలయ్య, కొక్కుల రాజేందర్, జంపాల రవీందర్, తదితరులు పాల్గొన్నారు.