
స్టాళ్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్‌బాబు
కాళేశ్వరం: సరస్వతినది పుష్కరాల నేపథ్యంలో పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు అందుబాటులో ఉండే సదుపాయాలను, సేవలను సమీక్షించేందుకు మంత్రి శ్రీధర్‌బాబు విస్తృతంగా పర్యటించారు. శుక్రవారం ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లు, భక్తులకు సరఫరా చేసే తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతుందని.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. స్వచ్ఛత, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మక్కన్ సింగ్ రాజ్‌ఠాకూర్, పరిశ్రమల శాఖ జీఎం సిద్దార్థ, డీఆర్‌డీఓ నరేష్ పాల్గొన్నారు.
మేడారంలో భక్తుల మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలకు మొక్కులు చెల్లించుకునేందుకు శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఛతీస్‌గఢ్, మహారాష్ట్రాల నుంచి భక్తులు ప్రైవేట్ వాహనల్లో మేడారానికి వచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. కల్యాణకట్టలో పుట్టువెంట్రుకలు సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఓడిబియ్యం, పూలు, పండ్లు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెలను దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మేడారం పరిసరాల ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకున్నారు. దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్ జగదీశ్వర్ భక్తులకు అందుబాటులో ఉండి సేవలందించారు.
దోమల నివారణ సామాజిక బాధ్యత
ములుగు: దోమల నివారణను ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించినప్పుడే డెంగీ వంటి ప్రాణాంతక జ్వరాలను అరికట్టగలమని డీఎంహెచ్‌ఓ డాక్టర్ గోపాల్‌రావు అన్నారు. ఈ మేరకు జాతీయ డెంగీ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులతో సమన్వయంగా ఉంటూ గ్రామాల్లో నీటినిల్వలు లేకుండా, దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత వైద్యసిబ్బందిపై ఉందన్నారు. జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి తగిన ప్రణాళిక రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో కీటకజనిత వ్యాధుల నియంత్రణ అధికారి ప్రొగ్రాం ఆఫీసర్ డాక్టర్ చంద్రకాంత్, డెమో సంపత్, ఏఎంఓ దుర్గారావు, కమ్యునిటీ హెల్త్ అధికారి సంపత్‌రావు, సబ్ యూనిట్ అధికారులు వెంకట్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, నరసింహారావు, సాంబయ్య, సురేష్‌బాబు, అరుణ, దేవేందర్, ల్యాబ్ టెక్నీషిన్లు, ఏఎన్‌ఎంలు, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు.
కొనసాగుతున్న తునికాకు కోతలు
ఏటూరునాగారం: మండలంలోని దొడ్ల, కొండాయి, ఐలాపురం తదితర ప్రాంతాలు రిజర్వు ఫారెస్టు అయినప్పటికీ అటవీశాఖ, కల్లేదారులు, కాంట్రాక్టర్లు చేతులు కలిపి తునికాకు కోయిస్తున్నారు. అక్కడ అధికారిక కల్లాలు లేనప్పటికీ కాంట్రాక్టర్ కావాలనే తునికాకు కోయించి అక్రమమార్గంలో తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఆకుకోసే కూలీల పేర్లు జాబితాల్లో రాకపోవడంతో కూలీతోపాటు బోనస్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది. వెంటనే రిజర్వు ఫారెస్టులో తునికాకు సేకరణను నిలిపివేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

స్టాళ్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్‌బాబు

స్టాళ్లను పరిశీలించిన మంత్రి శ్రీధర్‌బాబు