
నయనానందకరంగా నాగవెల్లి
మంగపేట: ఈనెల 8వ తేదీ నుంచి జరుగుతున్న మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా (జాతర) 9వ రోజు శుక్రవారం లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ ఉత్సవమూర్తులకు నాగవెల్లి కార్యక్రమాన్ని భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధాన అర్చకుడు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందంచే నయనానందకరంగా నిర్వహించారు. స్థాని క అర్చకులతో కలిసి ఉదయం 8గంటలకు ఉత్సవమూర్తులకు చతుస్నానార్చన, 9 గంటలకు అభిషేకం, 10 గంటలకు చక్రస్నానం నిర్వహించారు. చింతామణి జలపాతం వద్ద చక్రస్నానం తిలకించేందుకు యాత్రికులు పోటెత్తారు. అనంతరం ఆలయంలో సుదర్శన నరసింహ భవనంలో హోమ కార్యక్రమాలను కొనసాగించారు. సాయంత్రం 5 గంటల నుంచి ఆలయంలో మహా పూర్ణాహుతి నాగవెల్లి బాదశ ఆరాధనలతో పాటు పుష్పయాగం నివేదన మహా కుంభ ప్రోక్షణ తీర్థ గోష్టి ప్రసాద వినియోగం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచి యాత్రికులు విశేషంగా హాజరై వేడుకలను తిలకించారు. నేటి (శనివారం) వసంతోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగి యనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ సత్యనారాయణ, ఉత్సవ కమిటీ చైర్మన్ సురేష్, పవన్ కుమారాచార్యులు పాల్గొన్నారు.
పోటెత్తిన యాత్రికులు
నేటితో ముగియనున్న మల్లూరు బ్రహ్మోత్సవాలు

నయనానందకరంగా నాగవెల్లి