
చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోళ్లు
● వీసీలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
ములుగు: చివరి గింజ వరకూ ధాన్యం కొనుగోళ్లు చే యాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, కమిషనర్ డీఎస్ చౌహాన్‌తో కలిసి ధాన్యం కొనుగోలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో జిల్లా తరఫున కలెక్టర్ టీఎస్ దివాకర, అడిషనరల్ కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. హమాలీలు, వాహనాల కొరత లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. భారీగా ధాన్యం కొనుగోలు జరుగుతున్నప్పటికీ, ధాన్యం కొనుగోలు లేదనే తప్పుడు వార్తలను తిప్పికొట్టాలన్నారు. సమస్యలు ఏమైన ఉంటే పరిష్కరించాలని సూచించారు. వాతావరణంలో మార్పుల దృష్ట్యా కేంద్రాల వద్ద గన్నీబ్యాగులు, టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. కాన్ఫరెన్స్‌లో సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి, జిల్లా అధికారి సయ్యద్‌షా ఫైజల్ హుస్సేనీ, అధికారులు పాల్గొన్నారు.
‘ఉపాధి’లో ఎక్కువ మందిని
భాగస్వాములను చేయాలి
ఉపాధి హామీ పనుల్లో ఎక్కువ మందిని భాగస్వాములను చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున జరిగిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రాజీవ్ యువవికాసం స్కీం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా కాన్సెంట్ ఇప్పించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను క్షేత్రస్థాయిలో గుర్తించి సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులకు ఇన్సురెన్స్ ఉండేలా చూడాలని, జూన్ 2న హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంపత్‌రావు, డీపీఓ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.