
వైభవంగా హేమాచలుడి ‘తెప్పోత్సవం’
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు గురువారం మల్లూరు క్షేత్రంపై తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అలాగే ఎద్దు ముక్కు ఆంజనేయస్వామికి ఉదయం 8గంటలకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ అభిషేక కార్యక్రమాన్ని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి అర్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం, యాజ్ఞకులు అమరవాది రామ నరసింహాచార్యులు, శ్రీపెరంబుదూరు మదన మోహనాచార్యులు, మణిదీపాచార్యులు, శ్రీమాన్ రామచంద్రాచార్యులు, అభిరామాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
తెప్పోత్సవం తిలకించేందుకు
తరలివచ్చిన భక్తులు
సాయంత్రం 6 గంటలకు స్వామివారి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు తెప్పోత్సవ, దీపోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. తెప్పోత్సవ, దీపోత్సవ కార్యక్రమాలను తిలకించేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రవణం సత్యనారాయణ, ఆలయ బ్రహ్మోత్సవ ఉత్సవ కమిటీ చైర్మన్ యరంగారి సురేశ్, కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు కారంపూడి పవన కుమారాచార్యులు, ఏడునూతల ఈశ్వరచంద్, రామానుజన్ శర్మ, ముక్కామల వెంకటనారాయణ శర్మ, రాజీవ్ శర్మ, ఆలయ సిబ్బంది నేతానీ సీతారాములు, లక్ష్మీనారాయణ, శేషు, అజయ్, గణేశ్, నవీన్, నాగార్జున్, మహేష్, పుల్లయ్యలు పాల్గొన్నారు.
మహా అన్నదానం
శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహా స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం గుట్టపై వచ్చిన భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో, కమలాపురం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 5వేల మంది భక్తులకు అన్నదానం చేశారు.
ఆంజనేయస్వామికి
పంచామృతాలతో అభిషేకం
అశ్వవాహనంపై ఊరేగింపు
హేమాచల క్షేత్రంలోని నర్సింహస్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామంలో ఊరేగింపు నిర్వహించడంతో సందడి వాతావరణం నెలకొంది.

వైభవంగా హేమాచలుడి ‘తెప్పోత్సవం’

వైభవంగా హేమాచలుడి ‘తెప్పోత్సవం’