
ఓరుగల్లుకు నేడు ‘ప్రపంచ సుందరీమణులు’
సాక్షిప్రతినిధి, వరంగల్/వెంకటాపురం(ఎం): చారిత్రక నేపథ్యమున్న ఓరుగల్లులో వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బుధవారం సందడి చేయనున్నారు. కళలు, దేవాలయాలు, చారిత్రక కట్టడాలు.. సాంస్కృతిక వేదికలు.. సంస్కృతీసంప్రదాయాలకు పెద్దపీట వేసిన కాకతీయుల కాలంనాటి కట్టడాలను తిలకించనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు రెండు బృందాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, రామప్పలో సకల ఏర్పాట్లు చేశారు. ఐదు రోజులుగా హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్, వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. రామప్పలో ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ శబరీష్ రెవె న్యూ, పర్యాటక తదితర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులు చేయించారు.
ముస్తాబైన నగరం..
వరంగల్ నగరంలో మూడుచోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వేయిస్తంభాల దేవాలయం, ఫోర్ట్ వరంగల్ వద్ద సౌండ్ అండ్ లైట్, ఫ్లియా మార్కెట్, సాంస్కృతిక ప్రదర్శనల వేదిక, మీడియా పాయింట్లు ఏర్పాటు చేశారు. హరిత కాకతీయ, వేయిస్తంభాల ఆలయం, వరంగల్ కోట, పలు ముఖ్య కూడళ్లు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జిగేల్‌మంటున్నాయి. సుందరీమణుల పర్యటనను పర్యవేక్షించేందుకు వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న సీసీ కెమెరాలతోపాటు అదనంగా మరికొన్ని అమర్చారు. మూడంచెల భద్రత కోసం కమిషనరేట్ పరిధిలో సుమారు రెండు వేల మందికిపైగా పోలీసులను వినియోగిస్తున్నారు. హరిత హోటల్ చుట్టూ 200 మంది సిబ్బంది పహారా కాస్తున్నారు.
విద్యుత్ వెలుగుల్లో
వేయిస్తంభాల గుడి