‘రైతులకిచ్చిన హామీలను నెరవేర్చాలి’
ములుగు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మంద సారంగపాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్జద్‌పాషా డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్ మహేందర్‌జీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల వర్షం కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అమలు చేయాలని, పంటలు పండించిన రైతులకు రైతు భరోసాను సత్వరమే అందించాలన్నారు. పహానీ నకల్ ఆధారంగా రుణాలు పొందిన రైతులకు మాఫీ వర్తింపజేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని సులభతరం చేయాలని కోరారు. జిల్లాలో 15వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వెల్లడించారు.. లింగాపూర్, జవహర్‌నగర్ గ్రామాలలో రెవెన్యూ, అటవీశాఖలు ఉమ్మడి సర్వే నిర్వహించి కాస్తు కబ్జాలో ఉన్న రైతులకు పట్టాలు అందించాలని కోరారు. కాశిందేవిపేట, పత్తిపల్లి, పొట్లాపూర్, అన్నంపల్లి గ్రామాల రైతులకు దేవాదుల పైపులైన్ నీటిని అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల రాజు, ఇంజం కొమురయ్య, బండి నర్సయ్య, బోడ రమేష్, వెంకటస్వామిరెడ్డి, స్వామి, మహేందర్, లక్ష్మీనారాయణ, మనోహర్, వెంకట్రాం తదితరులు పాల్గొన్నారు.


