డబ్బులిస్తేనే సర్టిఫికెట్లు!
రేగొండ: తహసీల్దార్ కార్యాలయాల్లో డబ్బులిస్తేనే కులం ఆదాయం సర్టిఫికెట్లు వస్తున్నాయని మండలంలోని పలువురు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా రూ.4 లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణాలను అందజేస్తామని ప్రకటించింది. దరఖాస్తు చేసుకునేందుకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రం తాజాగా పొందాలనే నిబంధనతో ఆశావాహులు వాటి కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో మండల వ్యాప్తంగా మీసేవ కేంద్రాలన్ని కిటకిటలాడుతున్నాయి. రెవెన్యూ కార్యాలయాల నుంచి ఆ సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉండటంతో దరఖాస్తుదారులంతా తహసీల్దార్ కార్యాలయాలకు పరుగుపెడుతున్నారు. తహసీల్దార్ కార్యాలయాలల్లో సాధారణ సమయంలో రోజుకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం 50 వరకు దరఖాస్తులు అందేవని, ప్రస్తుతం వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు తెలుపుతున్నారు. కుప్పలు తెప్పలుగా అందుతున్న దరఖాస్తుల వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేస్తుండటంతో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా వివరాల నమోదులో జాప్యం అవుతుందని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు.
‘రాజీవ్ యువ వికాసం’కి కులం, ఆదాయం అవసరం
రెవెన్యూ కార్యాలయాల్లో
పెరిగిన దరఖాస్తులు
ఇదే అదనుగా దళారుల దోపిడీ
పలువురు అధికారులే దళారులుగా..
ప్రభుత్వ సాయం కోసం చేసే దరఖాస్తుకు రెవెన్యూ సర్టిఫికెట్లు అవసరముండటంతో ఇదే అదునుగా కొంత మంది అధికారులు దళారుల అవతారమెత్తుతున్నారు. అమాయకుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. రెండు రోజుల్లో ఇస్తామని చెబుతూ ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.300 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. చేసేది ఏమి లేక కొంతమంది వారు అడిగినంత ముట్ట చెబుతున్నారు. డబ్బులు ఇచ్చిన వారికి ఒక రోజులోనే సర్టిఫికెట్ అందజేస్తున్నారు. ఈ క్రమంలో సామాన్యులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. సర్వర్ బిజీ, నెట్ రావడం లేదంటూ రోజుల తరబడి వారి సర్టిఫికెట్లను పెండింగ్‌లోనే ఉంచుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించి పలువురు అధికారులు చేపడుతున్న అవినీతిని కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.


